Elon Musk Net Worth: ప్రపంచంలోనే ఖరీదైన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా (Tesla Inc) షేర్లు రెండేళ్ల కనిష్ట స్థాయి పడిపోయాయి. దీంతో, ఆ కంపెనీ CEO, ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తి ఎలాన్ మస్క్ (Elon Musk) భారీగా నష్టపోయారు. టెస్లా షేర్లు ఇప్పటివరకు సగానికి పైగా, 58 శాతం మేర క్షీణించాయి. దీనివల్లే మస్క్ సంపద వేగంగా ఆవిరవుతోంది. టెస్లాలో మస్క్‌కు 15 శాతం వాటా ఉంది.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) 100 బిలియన్ డాలర్ల (8.17 లక్షల కోట్ల రూపాయలు) నికర విలువను మస్క్ కోల్పోయారు. బ్లూమ్‌బెర్గ్ వెల్త్ ఇండెక్స్‌లో ( Bloomberg Wealth Index) ఈ బిలియనీర్ సంపద అత్యంత భారీగా క్షీణించింది.
ఏడాది క్రితం ఎలాన్ మస్క్ సంపద 340 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం దాదాపు 170 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే, ఏడాది వ్యవధిలోనే సగానికి సగం సంపద హరించుకుపోయింది. అయినా... ఇప్పటికీ ఆయనే ప్రపంచ నంబర్ 1 కుబేరుడు.
157 బిలియన్ డాలర్ల సంపదతో, బెర్నార్డ్ అల్నాల్ట్ మస్క్ తర్వాత రెండో స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య సంపద తేడా 13 బిలియన్ డాలర్లు మాత్రమే. మూడో స్థానం భారతీయుడిది. 130 బిలియన్ డాలర్ల సంపదతో గౌతమ్ అదానీ థర్డ్ ప్లేస్‌లో నిలబడ్డారు. 116 బిలియన్ డాలర్ల సంపదతో జెఫ్ బెజోస్, 113 బిలియన్ డాలర్ల సంపదతో బిల్ గేట్స్ 4, 5 స్థానాలను దక్కించుకున్నారు. 109 బిలియన్ డాలర్ల సంపదతో వారెన్ బఫెట్ 6th ప్లేస్‌లో, 93 బిలియన్ డాలర్ల సంపదతో లారీ ఎలిసన్ 7th ప్లేస్‌లో, 89 బిలియన్ డాలర్ల సంపదతో లారీ పేజ్ 8th ప్లేస్‌లో ఉన్నారు. 9వ స్థానం మళ్లీ భారతీయుడికి దక్కింది. 88 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేష్ అంబానీ తొమ్మిదో ర్యాంక్ కైవసం చేసుకున్నారు. 86 బిలియన్ డాలర్ల సంపదతో స్టీవ్ బామర్ 10వ స్థానంతో సరిపెట్టుకున్నారు.
రోజుకు రూ. 2,500 కోట్ల నష్టం
బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, టెస్లా CEO ఎలాన్ మస్క్ సంపద 2022లో 37% లేదా $101 బిలియన్లకు పైగా తగ్గుతుంది. ఇప్పటివరకు ఆయన రోజుకు దాదాపు 2,500 కోట్ల రూపాయల నష్టాన్ని భరిస్తున్నారు.
ట్విట్టర్ కొనుగోలుకు ముందు నుంచే ఎలాన్ మస్క్ చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, టెస్లా కార్లు చికాకు పెడుతున్నాయి. టెయిల్ లైట్లను వెలిగించడంలో అడపాదడపా వస్తున్న సమస్యల కారణంగా, అమెరికాలో 3,21,000 టెస్లా కార్లను కంపెనీ వెనక్కి పిలిపించుకుంది. ముందు సీటు ఎయిర్‌బ్యాగ్‌లో ఏర్పాటులో లోపాన్ని సవరించడానికి మరో 30,000 మోడల్ X కార్లను రీకాల్ చేసిందన్న వార్త బయటకు వచ్చింది. దీంతో, టెస్లా కంపెనీ షేరు 3 శాతం నష్టపోయి రెండేళ్ల కనిష్టానికి చేరి, గత లాభాలన్నింటినీ తుడిచి పెట్టేశాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచీ రిస్క్-ఆఫ్ మార్కెట్ ట్రెండ్‌లో చిక్కుకున్న ఈ కంపెనీ, ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది.
చైనాలోనూ చికాకులు
టెస్లా కార్లకు అమెరికా తర్వాత అతి పెద్ద మార్కెట్ చైనా. అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న జీరో కొవిడ్ విధానంతో వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది. వివిధ సాంకేతిక కారణాలతో ఇటీవలే అక్కడి మార్కెట్ నుంచీ 3 లక్షలకు పైగా కార్లను కంపెనీ రీకాల్ చేసింది. ఇది కూడా షేర్ ధరను దెబ్బకొట్టింది.