Indian Trains Some Exceptions: రైలు(Train) ఎక్కే ముందుగానే టికెట్(Train Ticket) కొనాలి. అది జనరల్ టికెట్ అయినా, రిజర్వేషన్ టికెట్ అయినా.. అంతా ముందే జరిగిపోవాలి. పొరపాటున టికెట్ కొనకుండా రైలెక్కితే అదో పెద్ద అవమానంగా భావిస్తుంటారు కొందరు. టికెట్ లేకుండా టీటీఈకి దొరికితే ఇక అంతే సంగతులు. జరిమానా కట్టడం అటుంచి, అందరి ముందు తలదించుకోవడం మరీ పెద్ద అవమానం. అయితే కావాలని అందరూ టికెట్ లేకుండా ప్రయాణించరు. పొరపాటున టికెట్ కొనే సమయం లేక కొంతమంది రైలెక్కుతారు. జనరల్ టికెట్ కొన్నా కూడా కొన్ని సందర్భాల్లో రిజర్వేషన్ బోగీ ఎక్కాల్సి రావొచ్చు. అంతమాత్రాన మనం ఇబ్బందిపడాల్సిన అవసరం లేదని అంటున్నారు రైల్వే అధికారులు. ఇండియన్ రైల్వేస్ నిబంధనల్లో టికెట్ లేని ప్రయాణికులకు కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఆ వెసులుబాట్లను క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇటీవల సోషల్ మీడియాలో ఉంచడంతో ఆ నియమాలు ఆసక్తికరంగా మారాయి. 


టికెట్ దొరక్కపోతే ఏం చేయాలి..?
సాధారణ బోగీ ప్రయాణికులకు టికెట్లు వెంటనే దొరుకుతాయి. రిజర్వేషన్ బోగీ ఎక్కాల్సిన వారికి కొన్ని సమయాల్లో ఆ సీట్లు దొరక్కపోవచ్చు, సమయానికి రిజ్వేషన్ అందుబాటులో ఉండకపోవచ్చు. తత్కాల్ వ్యవహారం కూడా వారికి తెలిసి ఉండకపోవచ్చు. కొన్నిసార్లు వెయిటింగ్ లిస్ట్ కూడా క్లియర్ కాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ప్రయాణికులు రైలు ఎక్కిన తర్వాత నేరుగా TTE దగ్గరకు వెళ్లి టికెట్ కోసం ఎంక్వయిరీ చేయాలి. ఖాళీగా ఉన్న సీట్ల సమాచారాన్ని అడిగి తెలుసుకోవాలి. వాటిల్లో తమకు కావాల్సిన సీటు ఎంపిక చేసుకుని కన్ఫామ్ చేయాలని వారిన కోరవచ్చు. టికెట్ కన్ఫామ్ అయినవారు రాకపోతే  వారికి కేటాయించిన బెర్త్ లను TTEలు వేరేవారికి ఇవ్వొచ్చు. 


సాధారణ ప్రయాణికులకోసం
కరోనా కాలంలో రైలు ప్రయాణాల సంఖ్య తగ్గింది కానీ, ఆ తర్వాత ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. భారతీయ రైల్వే లెక్కల ప్రకారం ప్రతి రోజు దాదాపు 2.5కోట్ల మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. వీరంతా టికెట్ కొని ప్రయాణించాల్సిందే. అయితే టికెట్ కొనలేకపోయినా రైలు ఎక్కి ఆ తర్వాత టికెట్ తీసుకునే సౌకర్యం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం రైలు లోపల టిక్కెట్లు తీసుకునే సౌకర్యాన్ని కూడా రైల్వే ప్రారంభించింది. సాధారణ బోగీల్లో టికెట్ లేకుండా ప్రయాణించాలంటే ముందుగా స్టేషన్ లో ప్లాట్ ఫామ్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ టికెట్ తీసుకున్న తర్వాత బోగీలో TTEని సంప్రదించాల్సి ఉంటుంది. అప్పుడు బోగీలోనే జనరల్ టికెట్ అందిస్తారు. TTE దగ్గర హ్యాండ్ హోల్డ్ మిషన్ ఉంటుంది. దాని సాయంతో లోపల ఉన్న ప్రయాణికులకు టికెట్లు జారీ చేస్తారు. TTE వద్ద ఉన్న మిషన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ సర్వర్ కు కనెక్ట్ అయి ఉంటుంది. దాని ద్వారా టికెట్ జారీ చేస్తారు. 


జరిమానా విషయంలో వెసులుబాటు..
టికెట్ లేకుండా రైలు ఎక్కితే జరిమానాలు భారీగా ఉంటాయి. అందుకే చాలామంది టికెట్ కొనకపోతే.. TTE కంటపడకుండా తప్పించుకుంటారు. అదే సమయంలో TTE దగ్గరే టికెట్ తీసుకునే వెసులుబాటు ఉంటే.. టికెట్ లేనివారంతా నేరుగా ఆయన వద్దకే వస్తారు దర్జాగా టికెట్ కొని ప్రయాణిస్తారు. అందుకే ఈ నిబంధనలను భారతీయ రైల్వే తెరపైకి తెచ్చింది. టికెట్ లేకుండా కోల్పోతున్న ఆదాయన్ని ఇలా కవర్ చేసుకోవాలని చూస్తోంది. జరిమానాల రూపంలో కొంతమంది వల్ల వచ్చే ఆదాయం కంటే.. టికెట్ లేనివారంతా టికెట్లు కొంటే వచ్చే ఆదాయమే ఎక్కువ. అందుకే రైల్వే కొత్త నిబంధనలపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది.