Professor Jayashankar Hometown Akkampet: తెలంగాణ సీఎంగా ప్రమాణం చేసిన మొదటి రోజే చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతోపాటు ఆరోగ్యశ్రీ పరిధి పెంపు ఇలాంటి నిర్ణయాలతోపాటు మరికొన్నింటిపై కూడా ఫోకస్ పెట్టారు. అందులోభాగంగా ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామాన్ని ప్రత్యేక రెవెన్యూ గ్రామంగా మార్చారు.
వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రాథమిక ప్రకటన జీ.ఓ. నెంబర్ 405ను ప్రభుత్వం విడుదల చేసింది. జయశంకర్ స్వగ్రామమైన అక్కంపేట ప్రస్తుతం పెద్దాపూర్ గ్రామంలో భాగంగా ఉంది.
మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఇంద్రవెల్లి సుందరీకరణకి సంబంధించిన ఆదేశాలు వెలువడ్డాయి. ఆ గ్రామంలో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద స్మృతి వనం సుందరీకరణ, అభివృద్ధికి ఎకరం భూమి కేటాయించింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన జీవోను కూడా ప్రభుత్వం జారీ చేసింది. అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవలసిందిగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ను రేవంత్ రెడ్డి ఆదేశించారు.