Tibet Earthquake: నేపాల్ - టిబెట్ సరిహద్దులో సంభవించిన భూకంపం వల్ల 126 మంది మృత్యువాత పడ్డారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 7న మంగళవారం ఉదయం నిమిషాల పాటు భూమి కంపించింది. దీంతో అక్కడి ప్రజలంతా భయంతో బయటికి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో దాదాపు 188 మంది గాయపడ్డారు. అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం, 3,609 ఇళ్లు కూలిపోయాయని, 407 మందిని రక్షించారు. భూకంపం వల్ల ప్రభావితమైన 30వేల మందిని తరలించారు. ఉష్ణోగ్రతలు మైనస్ 17 డిగ్రీల సెల్సియస్ ఉన్న ఆ ప్రాంతంలో నివాసితులను రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణాలకు తెగించి అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. 


ప్రతికూల పరిస్థితుల్లో పని చేస్తోన్న డిజాస్టర్ రెస్క్యూ బృందాలు (Disaster Rescue Teams)


అమెరికా వాతావరణ సేవల విభాగం ఈ భూకంప తీవ్రతను 7.1గా పేర్కొంది. ఈ క్రమంలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో చైనా భూకంప నిర్వహణ విభాగం సహాయక చర్యలు చేపట్టింది. జిజాంగ్‌ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో 15వందలకు పైగా స్థానిక సిబ్బంది రంగంలోకి దిగి, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భూఉపరితలం నుంచి 10 కి.మీ. లోతున భూకంపం రాగా.. ఈ నేపథ్యంలో హిమాలయ పర్వతాల్లోని ఎవరెస్ట్ పైకి పర్యాటకులకు చైనా అనుమతులను నిలిపివేసింది. ఇక భూకంప కేంద్రం ఉన్న టిబెట్ లో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు భావిస్తున్నారు.


భూకంపం దాటికి వణికిన ఉత్తరాది రాష్ట్రాలు


భూకంపం దాటికి నేపాల్ వంటి ఉత్తరాది రాష్ట్రాలు సైతం ప్రభావితమయ్యాయి. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ సహా అనేక చోట్ల భూమి కంపించింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ అనేక భవనాలు దెబ్బతిన్నాయి. బీహార్ లోనూ పలు ప్రాంతాలను కుదిపేసిన ఈ భూకంపం అక్కడ కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగనట్టు సమాచారం. ఈ ఘటనపై టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా విధ్వంసక భూకంపంలో ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నానని, గాయపడిందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు.


తరచూ భూకంపాలకు కారణమిదే


జిగాజే ఈశాన్య నేపాల్‌లోని ఖుంబు హిమాలయ శ్రేణిలో లోబుట్సేకి ఈశాన్యంగా 90 కి.మీ దూరంలో ఉంది. ఇది నేపాల్-టిబెట్-ఇండియన్ ట్రై-జంక్షన్ నుండి సిక్కింను తాకే టిబెట్ చివరి సరిహద్దు నగరం. జిజాంగ్‌లోని అత్యధిక జనాభా కలిగిన సరిహద్దు కౌంటీలలో టింగ్రి కౌంటీ ఒకటి. ఇక్కడ 61,000 కంటే ఎక్కువ జనాభా నివసిస్తున్నారు. ఇది హిమాలయాల ఉత్తర వాలుపై, దక్షిణాన నేపాల్ సరిహద్దులో ఉంది. దీని సగటు ఎత్తు 4,500 మీటర్లు. ఇండియన్, యురేషియన్ పలకల మధ్య రోజూ జరిగే ఘర్షణలో ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలకు కారణం. ఈ రాపిడి కారణంగానే హిమాలయాలు ఏర్పడ్డాయి. భవిష్యత్తులోనూ మరిన్ని భూకంప ప్రమాదాలు పొంచి ఉన్నాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.


Also Read : Justin Trudeau: అమెరికాలో కెనడా విలీనమా? అంత సీన్ లేదు, డొనాల్డ్ ట్రంప్‌నకు ఇచ్చి పడేసిన ట్రూడో