Wait For Ambulance:
మధ్యప్రదేశ్‌లో ఘటన..
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఆంబులెన్స్ లేట్‌గా రావడం వల్ల ఓ ఆర్నెల్ల చిన్నారి మృతి చెందాడు. దటియాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆంబులెన్స్ లేకపోవడం ఆ చిన్నారి ప్రాణాల్ని బలి తీసుకుంది. అనారోగ్యానికి గురైన చిన్నారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించింది. వెంటనే దటియాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. కానీ ఆంబులెన్స్ అందుబాటులో లేదు. అందుకోసం దాదాపు మూడు గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిబ్బంది సమయానికి సరైన విధంగా స్పందించలేదని, అందుకో తమ బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కనీసం ఆంబులెన్స్‌ని కూడా తెప్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ నిధులతో స్థానిక ఎమ్మెల్యే ఆసుపత్రికి మూడు ఆంబులెన్స్‌లు అందించారు. కానీ వాటిని హెస్త్ సెంటర్‌లో ఊరికే అలా పార్కింగ్ చేసి పెట్టారు. ఫ్యుయెల్ లేని కారణంగా పక్కన పెట్టారు. దీనిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెంటనే స్పందించి ఆ ఆసుపత్రికి వెళ్లారు. తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై స్పందించారు.
"ఆంబులెన్స్ రావాలంటే ఓ ప్రోటోకాల్ ఉంటుంది. ముందు 108కి కాల్ చేయాలి. కానీ పేషెంట్ వెల్ఫేర్ కమిటీ కింద నడిచే ఆంబులెన్స్‌లు అందుబాటులోనే ఉంటాయి. అత్యవసర సమయాల్లో ఇవి కచ్చితంగా స్పందించాలి. రోగులకు అవసరమైన సేవలు అందించాలి. ఎలాంటి డబ్బు తీసుకోకుండానే సర్వీస్ చేయాలి. ఏదేమైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం"
- చీఫ్ మెడికల్ ఆఫీసర్
గతంలోనూ...
సాధారణంగా ఎవరినైనా ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్‌ను వినియోగిస్తారు. మరింత అర్జెంట్ అయితే ఏదైనా వాహనంలో తరలిస్తారు. అయితే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని జేసీబీలో తరలించిన వీడియో గతేడాది సోషల్ మీడియాలో వైరల్ అయింది. మధ్యప్రదేశ్‌లోని కత్నీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఖిటౌలీ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బైకర్ తీవ్రంగా గాయపడ్డాడు. అంబులెన్సుకు ఫోన్ చేసినా సకాలంలో రాలేదు. దీంతో జనపద్ పంచాయతీ సభ్యుడు, జేసీబీ యజమాని అయిన పుష్పేంద్ర విశ్వకర్మ వెంటనే స్పందించి తన జేసీబీలోనే క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆ వ్యక్తికి వెంటనే చికిత్స అందించగలిగారు వైద్యులు.క్షతగాత్రుడిని జేసీబీలో ఆసుపత్రికి తరలించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. వెంటనే స్పందించి బాధితుడ్ని ఆసుపత్రికి తరలించిన జేసీబీ యజమానిపై ప్రశంసలు కురిపించారు నెటిజన్లు.