Bengaluru Hotels Gets Bomb Threat: బెంగళూరులో మూడు లగ్జరీ హోటల్స్‌కి బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బెదిరింపులు పంపారు. ఈ హోటల్స్‌లో The Oterra కూడా ఉంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మూడు హోటల్స్‌కీ హుటాహుటిన వెళ్లారు. బాంబ్ డిస్పోజల్,డిటెక్షన్ టీమ్స్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టాయి. ఇప్పటి వరకూ ఎలాంటి అనుమానాస్పద వస్తువులను పోలీసులు గుర్తించలేదు. ఇలా తరచూ బాంబు బెదిరింపుల మెయిల్స్ రావడం సంచలనమవుతోంది. ఇప్పటికే ఢిల్లీ వ్యాప్తంగా ఈ బెదిరింపులు అలజడి సృష్టిస్తున్నాయి. దాదాపు ఏడాదిగా అప్పుడప్పుడూ ఇలాంటి ఈమెయిల్స్ వస్తుండేవి. ఈ మధ్య తరచూ బెదిరింపులకు పాల్పడుతున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ మధ్యే ఢిల్లీలో 150 స్కూల్స్‌కి ఈ తరహా మెయిల్స్ రావడం పోలీసులను పరుగులు పెట్టించింది. స్కూల్ యాజమాన్యాలూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా కచ్చితంగా మూలాలు కనుక్కోవడం సాధ్యం కావడం లేదు.
ఇక స్కూల్స్‌తో పాటు ఏకంగా కేంద్ర హోంశాఖ కార్యాలయానికే బాంబు బెదిరింపు మెయిల్ రావడం అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. పార్లమెంట్‌లోని నార్త్ బ్లాక్ వద్ద బాంబు పెట్టినట్టు పోలీస్ కంట్రోల్ రూమ్‌కి మెయిల్ వచ్చింది. ఒక్కసారిగా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నార్త్ బ్లాక్‌ని చుట్టుముట్టింది. అణువణువూ గాలించింది. చివరకు ఏమీ లేదని తేల్చి చెప్పింది. అప్పటికి కానీ అధికారులంతా ఊపిరి పీల్చుకోలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని హోంశాఖ అధికారులను ఆదేశించింది. అయితే...రష్యాకి చెందిన వాళ్లే ఈ మెయిల్స్ పంపుతున్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. అక్కడి నెట్‌వర్క్ నుంచి ఎక్కువగా మెయిల్స్ రావడాన్ని గుర్తించారు. ఈ మేరకు రష్యా అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే...కచ్చితంగా ఇక్కడి నుంచి వచ్చాయని చెప్పడానికి వీల్లేదని, మూలాలు గుర్తించడం సవాల్‌గా మారిందని కొందరు అధికారులు చెబుతున్నారు.
కర్ణాటకలోనూ
అంతకు ముందు కర్ణాటకలోనూ పలు స్కూల్స్‌కి ఇదే విధంగా బెదిరింపులు వచ్చాయి. డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ ఇంటికి ఎదురుగా ఉన్న స్కూల్‌కీ మెయిల్ వచ్చింది. అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. అలాంటిదేమీ లేదని తేల్చారు. కావాలనే ఆట పట్టించేందుకు కొందరు ఆకతాయిలు ఇలాంటివి చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వెంటనే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఇలా అన్ని చోట్లా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా ఎక్కడి నుంచి మెయిల్స్ వస్తున్నాయన్నది మాత్రం తేలడంలేదు.
Also Read: Diamond Making: ఇకపై వజ్రాలు మనమే తయారు చేసుకోవచ్చు, అది కూడా కేవలం పావుగంటలోనే - ఎలాగో చూడండి