Scientists Making Diamond: ఓ వజ్రం తయారవడం అంత సులువైన విషయం కాదు. 15 వందల డిగ్రీల సెల్సియస్ వద్ద అత్యంత ఒత్తిడిలో వేల సంవత్సరాల పాటు మండిపోయి కార్బన్ అణువులు వజ్రాలుగా మారతాయి. అందుకే చాలా అరుదుగా ఎక్కడో భూమి లోతులో కనిపిస్తాయివి. వందల మైళ్లు తవ్వితే తప్ప అవి బయటపడవు. ఇదంతా ఓ సహజసిద్ధమైన ప్రక్రియ. అలా కాకుండా ఓ వజ్రం తయారు కావడానికి (how diamonds are formed) అవసరమైన వాతావరణాన్ని కృత్రిమంగా కల్పించి మనమే వజ్రాలు తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది..? వినగానే అసాధ్యమనిపిస్తుంది కానీ దీన్ని సుసాధ్యం చేసే పనిలో ఉన్నారు కొంత మంది సైంటిస్ట్‌లు. వజ్రం తయారీకి అవసరమయ్యే ఉష్ణోగ్రత, ఒత్తిడి లేకుండానే 15 నిముషాల్లో వజ్రాన్ని తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇది సక్సెస్‌ అయితే సింథటిక్ డైమండ్ ఇండస్ట్రీలో ఇదో విప్లవమే అవుతుంది. సౌత్ కొరియాలోని  Institute for Basic Science కి చెందిన కెమిస్ట్ దీనిపై ఓ జర్నల్ పబ్లిష్ చేశాడు. ఏప్రిల్ 24న పబ్లిష్ అయిన ఈ జర్నల్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకూ సింథటిక్ డైమండ్స్ ఏవైనా సరే 99% మేర హై టెంపరేచర్, హై ప్రెజర్‌ లోనే తయారవుతున్నాయి. కార్బన్ అణువులు వజ్రంగా మారాలంటే ఇది తప్పనిసరి. ఇలాంటి వాతావరణాన్ని సృష్టించడం అంటే అంత సులభం కాదు. పైగా కనీసం రెండు వారాల పాటు ఇదే వాతావరణంలో ఉంటే తప్ప ఓ వజ్రం తయారవదు. ఇవేమీ అవసరం లేకుండానే వజ్రం తయారు చేయొచ్చంటున్నారు సౌత్‌ కొరియా కెమిస్ట్. 



ఎలా తయారు చేసుకోవచ్చంటే..


సౌత్‌ కొరియాకి చెందిన కెమిస్ట్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఓ గ్రఫైట్‌ పాత్రలో గాలియంని (gallium) సిలికాన్‌ని కలిపి విపరీతంగా వేడి చేశారు. సముద్రాల వద్ద ఉండే వాతావరణ పీడన స్థాయి (Sea Level Atmospheric Pressure) వద్ద ఆ పాత్రను ఉంచారు. ఇదే విధంగా రకరకాల ప్రయోగాలు చేశారు. గాలియం, నికెల్, ఐరన్‌ని సిలికాన్‌తో కలిపి ఇలా వేడి చేసినప్పుడు వజ్రాలు తయారయ్యేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతోందని గుర్తించారు. అది కూడా కేవలం 15 నిముషాల్లోనే వజ్రాలు తయారు చేసుకోవచ్చనీ ధ్రువీకరించారు. ఎన్నో దశాబ్దాలుగా కృత్రిమంగా వజ్రాలు (Creation of Diamonds) తయారు చేయాలని చూస్తున్నట్టు కెమిస్ట్ వెల్లడించారు. అయితే...ఈ ప్రాసెస్‌లో ఎన్నో సవాళ్లు అధిగమించాల్సి ఉందని, ఇంకా అధ్యయనం జరగాల్సిన అవసరమూ ఉందని స్పష్టం చేశారు. మరో కీలక విషయం ఏంటంటే...ఈ ప్రాసెస్ ద్వారా కేవలం చిన్న చిన్న వజ్రాలనే తయారు చేసుకోడానికి వీలుంటుంది. అంటే సహజంగా ఏర్పడే వజ్రాల సైజ్‌ కన్నా ఇవి చిన్నగా ఉంటాయి. మరో రెండు సంవత్సరాల్లో ఈ ప్రక్రియపై పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుందని అప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోతుందని చాలా ధీమాగా చెబుతున్నారు ఆ కెమిస్ట్. 


Also Read: Swati Maliwal Assault Case: స్వాతి మలివాల్ కేసులో కీలక పరిణామం, కేజ్రీవాల్ తల్లిదండ్రుల్ని విచారించనున్న పోలీసులు