Swati Maliwal Case: ఢిల్లీలో స్వాతి మలివాల్ కేసు (Swati Maliwal Case) విచారణ కొనసాగుతూనే ఉంది. సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఆయన సహాయకుడు తనపై దాడి చేశాడంటూ ఆప్ ఎంపీ సంచలన ఆరోపణలు చేశారు. నిందితుడు బిభవ్ కుమార్‌పై కేసు పెట్టారు. విచారణ చేపట్టిన పోలీసులు బిభవ్ కుమార్‌ని అరెస్ట్ చేశారు. అయితే...ఇదంతా బీజేపీ కుట్ర అని ఆప్ ఆరోపిస్తోంది. ఎన్నికల సమయంలో కావాలనే ఇదంతా చేస్తున్నారని మండి పడుతోంది. బిభవ్ కుమార్‌తో పాటు తరచూ ఆప్ నేతల్ని అరెస్ట్ చేస్తుండడంపై కేజ్రీవాల్ నేతృత్వంలో నేతలంతా కలిసి ఢిల్లీలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఇన్వెస్టిగేషన్‌లోనూ దూకుడు పెంచారు. స్వాతి మలివాల్ కేసులో కేజ్రీవాల్ తల్లిదండ్రుల్నీ విచారించనున్నారు. ఆ రోజు ఏం జరిగిందో ఆరా తీయనున్నారు. ఇప్పటికే విచారణకు వాళ్లు అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ఓ విషయం వెల్లడించారు. ఢిల్లీ పోలీసులు వచ్చి తమ తల్లిదండ్రుల్ని విచారించనున్నారని చెప్పారు. విచారణకు కొంత సమయం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తిని కేజ్రీవాల్ తల్లిదండ్రులు అంగీకరించినట్టు తెలుస్తోంది. 


ఇప్పటికే ఈ కేసుపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. పారదర్శకంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రొసీడింగ్స్‌ కొనసాగుతున్నాయని ఇలాంటి సమయంలో తాను కామెంట్ చేయడం సరికాదని స్పష్టం చేశారు. కచ్చితంగా న్యాయం జరగాలని తేల్చి చెప్పారు. రెండు వైపులా వాదనలు విని అప్పుడు న్యాయం చేయాలని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై స్వాతి మలివాల్ అసహనం వ్యక్తం చేశారు. తనను బీజేపీ ఏజెంట్ అని కించపరుస్తూనే న్యాయం జరగాలంటూ మాట్లాడుతున్నారని మండి పడ్డారు. 


"నాపై కక్షగట్టారు. బీజేపీ ఏజెంట్ అనే అపవాదు తీసుకొచ్చారు. వీడియోలు ఎడిట్ చేశారు. దారుణంగా అవమానించారు. నిందితుడితో పాటే తిరిగారు. నిందితుడికి మద్దతుగా ఆందోళనలు చేశారు. ఇంత చేసి మళ్లీ విచారణ పారదర్శకంగా జరగాలని కేజ్రీవాల్ అంటున్నారు. ఇది ఏ మాత్రం సహించరాని విషయం"


- స్వాతి మలివాల్, ఆప్ ఎంపీ


బిభవ్ కుమార్ అత్యంత దారుణంగా తనపై దాడి చేశాడని స్వాతి మలివాల్ ఆరోపించారు. 7-8 సార్లు చెంప దెబ్బలు కొట్టడంతో పాటు కడుపులో తన్నాడని ఫిర్యాదు చేశారు. పీరియడ్స్ ఉన్నాయని చెప్పినా వినకుండా దాడి చేసినట్టు ఆరోపించారు. దాడి జరిగిన తరవాత తాను సరిగ్గా నడవలేకపోయానని చెప్పారు. ఇది జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్నానని, కానీ దాడి జరిగిన చోట మాత్రం లేనని అరవింద్ కేజ్రీవాల్ పోలీసులకు వివరించారు. మే 18వ తేదీన పోలీసులు బిభవ్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. 5 రోజుల పాటు కస్టడీలో ఉంచేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. ప్రస్తుతానికి ఈ కేసు విచారణ కొనసాగుతోంది. అటు రాజకీయంగానూ ఈ ఘటన దుమారం రేపింది. 


Also Read: Pune Porsche Crash: ఇది ప్రమాదం కాదు ముమ్మాటికీ హత్యే, కఠిన శిక్ష పడాల్సిందే - పోర్షే కేసులో మృతుడి తల్లి ఆవేదన