Porsche Crash Case: పుణేలోని పోర్షే యాక్సిడెంట్ (Porsche Accident Case) కేసు విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నిందితుడికి జువైనల్ జస్టిస్ బోర్డు నోటీసులు పంపింది. తప్పించుకునేందుకు ప్రయత్నించిన నిందితుడి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి ఈ రియల్టర్ కస్టడీలో ఉన్నాడు. అయితే...డ్రైవర్‌కి కార్ ఇచ్చి పంపామని, తన కొడుక్కి ఇవ్వలేదని కోర్టులో వాదించాడు నిందితుడి తండ్రి. బలవంతంగా డ్రైవర్ నుంచి కార్ కీస్ లాక్కుని మైనర్ డ్రైవ్ చేసినట్టు విచారణలో తేలింది. ఈ ఘటనపై బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15 గంటల్లోగా బెయిల్ ఎలా ఇచ్చారంటూ మండి పడుతున్నారు. ఎలాగైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన అనీష్ తల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రమాదం కాదని, ముమ్మాటికీ హత్యే అని తేల్చి చెప్పారు. నిందితుడి కుటుంబ సభ్యులే ఈ ప్రమాదానికి కారణమని, వాళ్ల నిర్లక్ష్యమే తన కొడుకు ప్రాణాలు తీసిందని మండి పడ్డారు. కఠిన శిక్ష విధించాల్సిందే అని స్పష్టం చేశారు.
"ఇది కచ్చితంగా ఆ మైనర్ తప్పే. నిజానికి దీన్ని ప్రమాదం అని కాకుండా హత్య అనే పరిగణించాలి. అంత పెద్ద తప్పు చేశాడు. అలా చేసుండకపోయుంటే ఇవాళ రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా ఉండేవి. ఆ మైనర్ కుటుంబ సభ్యులు కాస్తైనా కుర్రాడిపై శ్రద్ధ పెట్టి ఉంటే నా కొడుకు బతికే ఉండే వాడు. అందుకే దీన్ని కచ్చితంగా హత్యగానే చూడాలి"
- మృతుడి తల్లి
కొడుకుని కాపాడుకునేందుకు వాళ్లు చాలా ప్రయత్నాలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు మృతుడి తల్లి. కావాల్సినంత డబ్బు ఉంది కాబట్టి ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడేయాలని చూస్తున్నారని అన్నారు. కానీ కొడుకుని కోల్పోయి నష్టపోయింది మాత్రం తానేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే కల్పించుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.