Rahul Gandhi Bomb Threat:


మధ్యప్రదేశ్‌లో జోడో యాత్ర..


భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్నారు రాహుల్ గాంధీ. మహారాష్ట్రలో యాత్ర ముగించుకుని మధ్యప్రదేశ్‌కు వెళ్లారు. అయితే..రాహుల్ గాంధీని బాంబు పెట్టి చంపుతామని బెదిరిస్తూ ఇండోర్‌లోని ఓ స్వీట్‌ షాప్‌లో ఓ లేఖ దొరకటం కలకలం సృష్టిస్తోంది. ఈ షాప్‌లో ఎవరూ ఈ లెటర్‌ను పెట్టి వెళ్లారన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసులు దీనిపై విచారణ చేపడుతున్నారు. జుని ఇండోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీటీవీలోని విజువల్స్‌ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇండోర్‌లోని ఖల్సా స్టేడియంలో రాహుల్ గాంధీ నవంబర్ 24వ తేదీ రాత్రి బస చేయనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు బాంబు బెదిరింపులు రావడం సంచలనమైంది. ఎవరో కావాలనే తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటివి చేసి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నా...విచారణ మాత్రం కొనసాగిస్తున్నారు. రాహుల్ గాంధీ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే చర్చనీయాంశమయ్యాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనమయ్యాయి. ఈ నేపథ్యంలోనే..ఆయనకు బాంబు బెదిరింపు వచ్చింది. 


సోషల్ మీడియాపై కామెంట్స్..


సోషల్ మీడియాపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఎన్నికల్లో ఏ పార్టీనైనా గెలిపించే సామర్థ్యం సోషల్ మీడియాకి ఉంది" అని అన్నారు. "ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌ సెక్యూర్ అయినప్పటికీ..భారత్‌లోని ఎన్నికలన్నీ సోషల్ మీడియాపైనే ఆధారపడి ఉంటున్నాయి" అని వ్యాఖ్యానించారు. కావాలనే కొందరి అకౌంట్స్‌పై పక్షపాతం చూపిస్తున్నారని ఆరోపించిన ఆయన...తన సోషల్ మీడియా హ్యాండిల్స్ అందుకు ఉదాహరణ అని చెప్పారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు రాహుల్ గాంధీ. అక్కడ జరిగిన ఓ మీటింగ్‌లో ఈ కామెంట్స్ చేశారు. ఇప్పుడే కాదు. గతంలోనూ చాలా సార్లు సోషల్ మీడియాపై ఆరోపణలు చేశారు రాహుల్. ఈ ఏడాది జనవరిలో ట్విటర్‌ గురించి మాట్లాడారు. "నాకు ట్విటర్‌లో ఫాలోవర్లు పెరగకుండా చూడాలని కేంద్రం ఆ కంపెనీపై ఒత్తిడి తీసుకొస్తోంది" అని ఆరోపించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అప్పటి ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌కు లేఖరాశానని చెప్పారు రాహుల్. తనకు ట్విటర్‌లో 2 కోట్ల మంది ఫాలోవర్లు ఉండేవారని, రోజుకు కనీసం 8-10 వేల మంది యాడ్ అయ్యే వారని వివరించారు.


"నా ట్విటర్‌ హ్యాండిల్‌లో ఏదో జరుగుతోంది. 2021 ఆగస్టు నుంచి నా ట్విటర్‌కు సంబంధించిన యావరేజ్ ఫాలోవర్ల సంఖ్య జీరోకి పడిపోయింది. ఎవరో నా అకౌంట్‌ను వెనకుండి నడిపిస్తున్నారని అనిపిస్తోంది" అని ఆ లేఖలో పేర్కొన్నారు. గతేడాది ఆగస్ట్‌లో రాహుల్ గాంధీ ట్విటర్ అకౌంట్‌ను కొన్ని రోజుల పాటు బ్లాక్ చేశారు. దళిత యువతి అత్యాచారం గురించి ప్రస్తావిస్తూ బాధితురాలి ఫోటోన్ ట్విటర్‌లో షేర్ చేశారు రాహుల్. వెంటనే అలర్ట్ అయిన ట్విటర్ టీమ్...ఆయన అకౌంట్‌ను లాక్ చేసింది. వారం రోజుల తరవాత రీస్టోర్ చేసింది. దీనిపైనా రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను షేర్ చేసిన ఫోటోని...కొన్ని ప్రభుత్వ సంస్థలూ షేర్ చేశాయని, కానీ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండి పడ్డారు. కొందరు దేశంలో మత సామరస్యాన్ని తుడిచి పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, దీన్నో ఆయుధంగా మార్చుకుంటున్నాయని బీజేపీపై పరోక్షంగా విమర్శలు చేశారు. 


Also Read: Layoffs in Amazon: కంపెనీకి ఇది టఫ్ టైమ్, వచ్చే ఏడాది వరకూ లేఆఫ్‌లు తప్పవు - అమెజాన్ సీఈవో