Layoffs in Amazon:


సీఈవో ప్రకటన..


ట్విటర్, ఫేస్‌బుక్ తరవాత భారీగా లేఆఫ్‌ల దిశగా అడుగులు వేస్తోంది అమెజాన్. ఇప్పటికే దీనిపై వార్తలు వస్తుండగా..ఇప్పుడా కంపెనీ సీఈవోనే స్వయంగా లేఆఫ్‌ల గురించి మాట్లాడారు. ఆ వార్తలు నిజమేనని చెప్పారు. అంతే కాదు. వచ్చే ఏడాది కూడా ఈ లేఆఫ్‌లు కంటిన్యూ అవుతాయని స్పష్టం చేశారు సీఈవో యాండీ జాసీ. కాస్ట్ కటింగ్‌లో భాగంగా కార్పొరేట్ స్థాయి ఆఫీసర్లనూ తొలగించక తప్పడం లేదని వెల్లడించారు. ఇప్పటికే...అమెజాన్ ఉద్యోగులందరికీ మెయిల్స్ పంపారు. కొద్ది రోజుల వరకూ లేఆఫ్‌లు కొనసాగుతాయని అందులో పేర్కొన్నారు. ఇప్పటికే కొంత మందిని వరుసగా తొలగిస్తోంది అమెజాన్. దీనిపై స్పందించిన యాండీ జాసీ..కీలక వ్యాఖ్యలు చేశారు. "ఇది అమెజాన్‌కు ఎంతో కష్ట కాలం. నేను ఈ కంపెనీ సీఈవోగా ఏడాదిన్నర నుంచి పని చేస్తున్నాను. ఇప్పటి వరకూ తీసుకున్న నిర్ణయాల్లో అతి కష్టమైంది, బాధ కలిగించింది ఈ లేఆఫ్‌లే. ఈ మధ్య కాలంలో కంపెనీ రెవెన్యూ పడిపోతోంది. ఆ మేరకు కాస్ట్ కటింగ్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించాల్సి వస్తోంది. కొత్తగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవటం కూడా పూర్తిగా నిలిపివేశాం" అని చెప్పారు. కరోనా సమయంలో చాలా మంది ఆన్‌లైన్‌ షాపింగ్ చేశారని, అప్పట్లో కొత్తగా చాలా మందిని రిక్రూట్ చేసుకున్నామని అన్నారు. అయితే...ఈ మధ్య కాలంలో అందరూ ఆచితూచి ఖర్చు చేస్తున్నారని, ఉన్నట్టుండి బిజినెస్ పడిపోయిందని వివరించారు యాండీ జాసీ. అందుకే...లేఆఫ్‌ల ప్రక్రియ మొదలుపెట్టామని తెలిపారు. కాలిఫోర్నియా అమెజాన్ ఇప్పటికే 250 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. వీరిలో డేటా సైంటిస్ట్‌లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లతో పాటు కార్పొరేట్ వర్కర్‌లు ఉన్నారు. వచ్చే ఏడాది జనవరి 17వ తేదీవరకూ లేఆఫ్‌లు కొనసాగుతాయని అమెజాన్ చెబుతోంది. 


భారత్‌లోని ఉద్యోగులపై ప్రభావం..


భారత్‌లో వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం 10 వేల మందిని తొలగించాలని అమెజాన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. భారత్‌లో ఎంత మందిని తొలగిస్తారని కచ్చితంగా సంఖ్య తెలియకపోయినా...భారీగానే ఉంటాయని అంటున్నారు. మెటా కంపెనీ కన్నా ఎక్కువ మంది ఉద్యోగులకు ఉద్వాసన ఇచ్చేందుకు ప్లాన్ రెడీ చేసుకుంటోందట అమెజాన్. భారత్‌లో అమెజాన్‌కు లక్షా 10 వేల మంది ఉద్యోగులున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంగా సాగుతున్నందున బిజినెస్ పెద్దగా జరగడం లేదు. అందుకే...కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఈ లేఆఫ్‌లు చేపట్టాలని అనుకుంటోంది అమెజాన్ కంపెనీ. "లేఆఫ్‌ల ప్రక్రియ సిద్ధమ వుతోంది. కానీ ఎంత మంది అన్న సంఖ్య అయితే తెలీదు" అని ఓ రిపోర్ట్ వెల్లడించింది.  ఈ కంపెనీలోని కార్పొరేట్ స్టాఫ్‌లో 3% మందిని తొలగిస్తారని గతంలోనే వార్తలొచ్చాయి. అమెరికాలో ప్రస్తుతానికి ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతోంది. దీన్ని కట్టడి చేసేందుకు Federal 
Reserve, Central Bank of America వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతున్నాయి. ఈ నిర్ణయం కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థపై  ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇది క్రమంగా...టెక్ కంపెనీల ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్‌ను దెబ్బ తీస్తోంది. 


Also Read: భారత్‌ తొలి ప్రైవేట్‌ రాకెట్ ప్రయోగం విజయవంతం- నిప్పులు చిమ్ముతూ నింగిలోకి వెళ్లిన విక్రమ్‌ఎస్‌