భారత్ అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర ప్రారంభమైంది. ప్రపంచాన్ని శాసించే మరో అవిష్కరణకు ఇస్రో వేదికైంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ ప్రైవేట రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు శాస్త్రవేత్తలు. ఇప్పటి వరకూ భారత్ కి సంబంధించిన ప్రయోగాలనే ఇస్రో చేపట్టింది. పలు ప్రైవేటు ఉపగ్రహాలను నింగిలోకి పంపినా, రాకెట్ మాత్రం ఇస్రోనే తయారు చేసేది. కానీ ఈసారి రాకెట్ కూడా ప్రైవేటుదే. అంటే పూర్తిగా ఇది ప్రైవేట్ ప్రయోగం. దీనికి కేవలం ఇస్రో లాంఛింగ్ ప్యాడ్ ని మాత్రమే వినియోగించారు.
అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు, స్టార్టప్‌లకు అవకాశాలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఇస్రో. దీనిలో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ ఈ రాకెట్‌ను రూపొందించింది. ఇస్రో, ఇన్ స్పేస్ సహకారంతో రెండేళ్ల కాల వ్యవధిలో దీన్ని సిద్ధం చేశారు. దీనికి విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టారు. విక్రమ్-ఎస్1 అనే పేరుతో ఈ ప్రయోగం జరిగింది. తొలిసారిగా పంపిన ఈ రాకెట్ పేరు ప్రారంభ్.
తొలి రాకెట్ ద్వారా స్పేస్ కిడ్స్ ఇండియా (ఇండియా-తమిళనాడు), బజూమ్ క్యూ (ఆర్మేనియా), ఎన్-స్పేస్ టెక్ (ఇండియా-ఏపీ)కి చెందిన మూడు పేలోడ్ లను నింగిలోకి పంపించారు.
విక్రమ్ -ఎస్1 రాకెట్ విశేషాలు..
బరువు – 545 కిలోలు
పొడవు – 6 మీటర్లు
పేలోడ్ సామర్థ్యం – 83 కిలోలు