Arun Goel Resignation: లోక్‌సభ ఎన్నికల ముందు ఊహించని పరిణామం జరిగింది. మరి కొద్ది రోజుల్లోనే షెడ్యూల్ విడుదలవుతుందనగా ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయడం సంచలనం సృష్టిస్తోంది. అంత కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తి ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఈ విషయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అయితే...ఉన్నట్టుండి ఆయన ఈ నిర్ణయం తీసుకోడానికి కారణమేంటన్న చర్చ తెరపైకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం...వ్యక్తిగత కారణాల వల్లే ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. కొంత మంది ఆయనకు ఆరోగ్యం బాగోలేదని, అందుకే రాజీనామా చేశారని చెప్పారు. కానీ...అవన్నీ పుకార్లే అని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్‌తో విభేదాలు వచ్చాయని, అందుకే గోయల్ బయటకు వచ్చేశారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘంలో మొత్తం ముగ్గురు కీలక సభ్యులుంటారు. రాజీవ్‌ కుమార్, అరుణ్ గోయల్‌ ఉన్నప్పటికీ మరో స్థానం ఖాళీగానే ఉంది. ఇప్పుడు అరుణ్ గోయల్ కూడా వెళ్లిపోవడం వల్ల ఈసీలో రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలిపోయారు. 


పంజాబ్‌లో IAS ఆఫీసర్‌గా పని చేసిన అరుణ్ గోయల్...2022 నవంబర్‌లో ఎన్నికల సంఘంలో ఈ బాధ్యతలు తీసుకున్నారు. వచ్చే వారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ లోగా అరుణ్ గోయల్ రాజీనామా చేయడం వల్ల ఈ తేదీల్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కొత్త ఎలక్షన్ కమిషనర్‌ని నియమించాలంటే చాలా పెద్ద తతంగమే ఉంటుంది. కేంద్రన్యాశాఖ మంత్రి నేతృత్వంలోని కమిటీ ఐదుగురు పేర్లని షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తరవాత ప్రధాని నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ కమిటీలో ప్రధానితో పాటు ఓ కేంద్రమంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత కూడా ఉంటారు. ఈ నియామకం విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకోడానికి వీల్లేకుండా ఇప్పటికే కేంద్రం ఓ నిబంధన తీసుకొచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అరుణ్ గోయల్ రాజీనామాపై స్పందించారు. ఎన్నికల సంఘం తీరుపై సెటైర్లు వేశారు. ఉన్న ఒక్క ఎలక్షన్ కమిషనర్ కూడా ఇలా వెళ్లిపోతే ఎలా అని ప్రశ్నించారు. స్వతంత్రంగా పని చేసే సంస్థలపై ఆజమాయిషీ కోసం ప్రయత్నిస్తే ఇలాంటివే ఎదుర్కోవాల్సి వస్తుందని మోదీ సర్కార్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. 






Also Read: మోదీ పేరు జపిస్తే మీ భర్తకి తిండి పెట్టడం మానేయండి - మహిళా ఓటర్లతో కేజ్రీవాల్