AP BJP Candidates List: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం అందరూ ఊహించిన విధంగానే టీడీపీ - జనసేనతో పాటు బీజేపీ కూడా కలిసిపోయింది. ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరినట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా విడుదల అయింది. ఈ క్రమంలో రాష్ట్రంలో లోక్ సభ సీట్ల సర్దుబాటు విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, బీజేపీ అధిష్ఠానం తమకు 10 సీట్లు ఇవ్వాలని పట్టుబట్టినట్లుగా తెలిసింది. కానీ, టీడీపీ మాత్రం 6 స్థానాలు బీజేపీకి ఇచ్చేందుకు అంగీకరించినట్లుగా తెలిసింది. అటు అసెంబ్లీ స్థానాల విషయంలో మరో ఆరు సీట్లను బీజేపీ కేటాయించినట్లు సమాచారం. జనసేనకు తొలుత మూడు ఎంపీ స్థానాలు ఇవ్వాలని భావించగా.. తాజాగా రెండు మాత్రమే ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొత్తం 25 ఎంపీ స్థానాల్లో బీజేపీ 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. జనసేన 2 స్థానాల్లో బరిలో దిగనున్నట్లు సమాచారం. ఇంకా మిగిలిన 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేయనుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన 24 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ కల్యాణ్, చంద్రబాబు సంయుక్తంగా ప్రకటించారు.
బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే!
అయితే, బీజేపీ పోటీ చేయబోతున్నట్లుగా భావిస్తున్న ఆరు ఎంపీ నియోజకవర్గాలు కూడా ఖరారు అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అరకు, అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట, హిందూపురం, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ సీట్లను టీడీపీ బీజేపీకి కేటాయించినట్లు తెలిసింది. తొలుత విజయవాడ, విశాఖపట్నం సీట్లను కూడా కేటాయించాలని బీజేపీ కోరగా.. అందుకు చంద్రబాబు ఒప్పుకోలేదని తెలిసింది. విశాఖపట్నం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు దగ్గరి బంధువు, బాలక్రిష్ణ చిన్న అల్లుడు శ్రీభరత్ ఉండడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం గీతమ్ విద్యాసంస్థల బాధ్యతలను ఈయనే చూస్తుండగా.. గత ఎన్నికల్లోనూ విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ, అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ స్వింగ్ వల్ల ఓడిపోయారు.
మరోవైపు, విజయవాడ సీటును బీజేపీకి కేటాయించే విషయంలోనూ చంద్రబాబు ఒప్పుకోలేదని తెలిసింది. విజయవాడ టీడీపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఈసారి టీడీపీ గెలవడం చాలా సులువు అని చెబుతున్నారు. రాజధాని ప్రాంతం కావడం.. అధికార పార్టీ తీరుపై అక్కడివారు తీవ్రమైన అసమ్మతి ఉండడం వంటి కారణాలతో పాటు విజయవాడ ప్రాంతంలో కమ్మ సామాజికవర్గం బలం అధికంగా ఉండడం వంటివి ఆ పార్టీకి కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు. అంతేకాక, మొదటి నుంచి కూడా ఈ ప్రాంతం టీడీపీకే అనుకూలంగా ఉంటోంది.
బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే..!
అరకు స్థానం నుంచి గీత, అనకాపల్లి నుంచి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, రాజమండ్రి నుంచి పురందేశ్వరి, కడప జిల్లా రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి లేదా సాయి లోకేష్, హిందూపూరం నుంచి - సత్య కుమార్ లేదా పరిపూర్ణానంద స్వామి, ఏలూరు నుంచి సుజనా చౌదరి లేదా తపనా చౌదరి పేర్లను ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.