Justice NV Ramana: 


భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ 16 నెలల పదవీకాలంలో జనహితమే ధ్యేయంగా పలు కీలక తీర్పులు, ఉత్తర్వులు వెలువ రించారు. ఐతే.. ఎన్ని తీర్పులు ఇచ్చినా.. పదవీ విరమణ తరువాత అందరికి గుర్తుండేవి కొన్ని  మాత్రమే. ఆయన సీజేఐగా ఇచ్చినతీర్పులేంటో ఓ సారి చూద్దాం. 


పలు కీలక తీర్పులు..


ప్రభుత్వాలు సెక్షన్ -124 A ను ఇష్టారితీన ఉపయోగించడాన్ని సీజేఐగా ఎన్.వి. రమణ తప్పు పట్టారు. వలస కాలం నాటి చట్టాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించేంతవరకూ దానికింద ఎఫ్‌ఆఐర్‌లు నమోదు చేయడంలో సంయమనం పాటించాలని ఆదేశించారు. ఈ సెక్షన్ కింద..  జైళ్లలో మగ్గుతున్నవారు బెయిలు కోసం న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని స్పష్టతనిచ్చారు. కోర్టులు బెయిలు మంజూరు చేసినా.. ఆ ఉత్తర్వులు అందలేదన్న కారణంతో ఖైదీల విడుదలలో అలసత్వాన్ని నివారించాడానికి  ‘ఫాస్టర్‌’ పేరుతో సురక్షితమైన ఎలక్ట్రానిక్‌ వ్యవస్థను అందుబాటు లోకి తెచ్చారు. కఠినమైన UAPA చట్టం కింద అరెస్టైన ఓ కేరళ జర్నలిస్ట్ కి దిల్లీలో వైద్య సేవలు అందించాలని జస్టిస్‌ రమణ ఆదేశించారు. విచారణలో ఉన్నవారికి కూడా జీవించే ప్రాథమిక హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. 


ప్రజల జడ్జ్‌గా..


ఝార్ఖండ్‌లో ధన్‌బాధ్‌ అదనపు జిల్లా జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ను పట్టపగలు ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన ఘటనను సుమోటోగా తీసుకొని సీబీఐ దర్యాప్తునకు సీజేఐ జస్టిస్‌ రమణ ఆదేశించారు. ఆ దారుణానికి పాల్పడినవారికి ఏడాది కంటే తక్కువ సమయంలోనే శిక్ష ఖరారయ్యేలా చేశారు. జస్టిస్‌ రమణ సీజేఐ పీఠమెక్కాక ఇప్పటి వరకు సుప్రీంకోర్టు కొలీజియం 11 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు 250 మందికిపైగా హైకోర్టు జడ్జీలను నియమించింది. 15 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకాన్ని పూర్తిచేసింది. తద్వారా ఖాళీల భర్తీ విషయంలో జస్టిస్‌ రమణ సరికొత్త రికార్డు నెలకొల్పారు. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 37కు పెంచాలని ప్రయత్నించారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఏర్పాటుకు కృషి చేశారు. ఏళ్లకు ఏళ్లు గెలుపు కోసం కోర్టుల చుట్టు తిరగడం కంటే.. మధ్యవర్తిత్వం ద్వారా తక్కువ సమయంలో ఇరు వర్గాలు గెలుపు పొందవచ్చు. ఇలా.. మధ్యవర్తిత్వాన్ని ఇంతలా ప్రోత్సహించిన సీజేఐ మరోకరు బహుశా లేరేమో. అందుకే.. ఎన్.వి. రమణ ప్రజల జడ్జిగా గుర్తింపు పొందారు. 


పెండింగ్‌లో కొన్ని..


ఐతే.. జస్టిస్ ఎన్.వి. రమణ  కొన్ని రాజ్యంగ విధానపరమైన అంశాలకు సంబంధించిన 53 కేసులలో constitution bench అవసరమైనప్పటీకి న్యాయ సమీక్ష అధికారాన్ని ఉపయోగించుకోలేదనే వాదనలున్నాయి. అవేంటంటే.. ఆర్టికల్ 370 రద్దుపై వేసిన పిటిషన్ న్ ను 11 వందలకుపైగా రోజులుగా పెండింగ్ లోనే పెట్టారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో హిజాబ్  ధరించడాన్ని  కర్ణాటక ప్రభుత్వం రద్దు చేయడాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. కానీ, ఇది సుమారు 160 రోజులుగా పెండింగ్ లోనే ఉంది. కులం ఆధారంగా కాకుండా.. ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలనే పిటిషన్ దాదాపుగా  13వందల రోజులకుపైగా పెండింగ్ లో ఉంది. ఉపా యాక్ట్ -1967 సవాల్ చేస్తు వేసి కేసు సైతం 11 వందల రోజులకుపైగా పెండింగ్ లో ఉంది. రాజకీయ పార్టీలకు ఇచ్చే ఎలక్ట్రోల్ బాండ్ లపై పారదర్శకత అవసరమనే దానిపై వేసిన కేసు  18 వందల రోజులకుపైగా పెండింగ్ లో ఉంది. దీంతో.. సాధారణ తీర్పుల్లో వైవిధ్యం, సామాన్యుడికి చేరువయ్యే ప్రయత్నం చేసిన జస్టిస్ ఎన్. వి. రమణ... రాజ్యంగ విధాన పరమైన కేసులలో మాత్రం కాస్త సంయమనం పాటించారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.