ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. ట్రైబ్యునళ్ల భర్తీకి సంబంధించి కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు ఫైర్ అయింది. సభ్యుల ఎంపిక విధానాన్ని తప్పుబట్టింది. తాము ఎంతో కష్టపడి దేశవ్యాప్తంగా ఇంటర్వ్యూలు చేసి, కొందరి పేర్లను సిఫార్సు చేస్తే వాటిని కేంద్రం పక్కనబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖాళీల భర్తీకి సంబంధించి దాఖలైన పిటిషన్లపై సీజేఐ ధర్మాసనం బుధావారం విచారణ జరిపింది.
కేంద్రానికి రెండు వారాలు గడువు కల్పిస్తున్నామని, ఆలోగా సరైన సభ్యులతో నియామకాలు చేపట్టి అపాయింట్‌మెంట్ లెటర్లతో తమ వద్దకు రావాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది.