Indian Army: భారత సైన్యంలో అసలు కేడర్, నియామకాలతో సంబంధం లేకుండా బ్రిగేడియర్, ఆపై స్థాయి అధికారులకు ఒకే యూనిఫాం తీసుకురావాలని నిర్ణయించారు. ఇటీవల ముగిసిన ఆర్మీ కమాండర్ల సదస్సులో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే కల్నల్ స్థాయి, ఆర్మీ కంటే తక్కువ స్థాయి అధికారుల యూనిఫాంలో ఎలాంటి మార్పు ఉండదు. ఫ్లాగ్ ర్యాంక్ (బ్రిగేడియర్, అంతకంటే ఎక్కువ) సీనియర్ అధికారుల హెడ్గేర్, షోల్డర్ ర్యాంక్ బ్యాడ్జీలు, గోర్గేట్ ప్యాచ్లు, బెల్టులు, బూట్లు ఇకపై ఒకేలా ఉంటాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఫ్లాగ్ ర్యాంక్ అధికారులు ఇకపై ఎలాంటి తీగలు ధరించరు. ఈ మార్పులు ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. భారత సైన్యంలో కల్నల్, అంతకంటే తక్కువ స్థాయి అధికారులు ధరించే యూనిఫాం యథాతథంగా ఉంటుంది. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.
గత ఏడాది జనవరిలో 13 లక్షల మంది సైనికుల పోరాట దుస్తుల్లో మార్పు చేశారు. జవాన్లకు మరింత సౌకర్యం కలిగించేలా, యుద్ధ క్షేత్రంలో శత్రువులను మెరుగ్గా ఏమార్చేలా వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. సైనిక దళాలకు ప్రత్యేకత తెచ్చేది వారు ధరించే విలక్షణ యూనిఫామే. సందర్భానికి తగ్గట్లు దుస్తులు వేసుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న సైనిక ఆనవాయితీ. ఇందులో పోరాట యూనిఫాం (కంబాట్ డ్రెస్)కు ఎనలేని ప్రాధాన్యం ఉంది. తీవ్ర వేడి, చలి నుంచి సైనికులను రక్షించడం, పరిసరాలకు అనుగుణంగా మారుతూ మెరుగ్గా కలిసిపోయి శత్రువులను తెలివిగా బోల్తా కొట్టించడం వీటి ఉద్దేశం. ఇందుకోసం వస్త్రంపై భిన్న వర్ణాలను ఒక పద్ధతిలో కలపడం ద్వారా ఒక ప్యాటర్న్‌ను ఏర్పరుస్తారు.
కొత్త యూనిఫాంను అన్ని భౌగోళిక ప్రదేశాలకూ అనువుగా తీర్చిదిద్దారు. దీంతో సైనికులు తమ పరిసరాలతో సులువుగా కలిసిపోతారు.ఈ కొత్త డ్రస్‌ను టక్ చేయరు. బెల్టు బయటకు కనిపించదు. లోపల టి షర్టు ధరించాలి. ప్యాంట్‌కు అదనపు జేబులు ఉంటాయి. ప్యాంట్ దిగువ భాగం.. బూట్లలోకి ఒదిగిపోతుంది. పోరాట దుస్తుల్లో ర్యాంకును సూచించే చిహ్నాలను భుజాలపై కాకుండా.. ముందు భాగంలో గుండీల దగ్గర ప్రదర్శించే అవకాశం ఉంది. మెరుగైన కమోఫ్లాజ్ కోసం వాటిని నలుపు రంగులో ప్రదర్శిస్తారన్న అభిప్రాయమూ ఉంది. కొత్త యూనిఫాం 13 సైజుల్లో లభ్యమవుతుంది. వీటిని పూర్తిగా సైన్యానికే ప్రత్యేకించారు. భద్రతా కారణాల కారణంగా పౌరులకు అందుబాటులో ఉంచరాదని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పుడు బ్రిగేడియర్, అంతకంటే ఎక్కువ సీనియర్ అధికారుల హెడ్గేర్, షోల్డర్ ర్యాంక్ బ్యాడ్జీలు, గోర్గేట్ ప్యాచ్లు, బెల్టులు, బూట్లు ఒకేలా ఉండాలని నిర్ణయం తీసుకోవడం కీలకం అనుకోవచ్చు.