Texas Dairy Farm Fire:


టెక్సాస్‌లో ప్రమాదం 


వెస్ట్ టెక్సాస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఫ్యామిలీ డెయిరీ ఫామ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 18 వేల ఆవులు మంటల్లో బూడిదయ్యాయి. డిమ్మిట్‌ వద్ద South Fork Dairy ఫామ్‌లో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. అమెరికా చరిత్రలోనే ఇంత ఘోరమైన అగ్నిప్రమాదం జరగలేదు. క్షణాల్లోనే మంటలు డెయిరీ ఫామ్ అంతటా వ్యాపించాయి. అంతకు ముందు పాలు పితికేందుకు సిబ్బంది ఆవులన్నింటినీ ఒక చోటకు చేర్చారు. ఫలితంగా మంటలు అంటుకున్న వెంటనే ఇవి ఆహుతైపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ఫామ్‌లో చిక్కుకున్న ఓ వ్యక్తిని మాత్రం సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి కారణమేంటన్నది ఇంకా తేలలేదు. ప్రస్తుతానికి దీనిపై విచారణ చేపడుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే...ఫామ్‌లోని ఓ మెషీన్ ఉన్నట్టుండి మిథేన్ గ్యాస్‌ను విడుదల చేసి ఉండొచ్చని, అందుకే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మిల్కింగ్ ఏరియాకు ఆవులు వచ్చిన వెంటనే మంటలు అంటుకోవడం వల్ల భారీగా నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు. ఏవో కొన్ని ఆవులు మాత్రం ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాయి. కొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే జంతు సంరక్షణా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కట్టడి చేయాలని డిమాండ్ చేశాయి. యానిమల్ వెల్ఫేర్ ఇన్‌స్టిట్యూట్ (AWI) కల్పించుకుని పశువులకు సంరక్షణ ఇవ్వాలని సూచించాయి. 


Also Read: Amazon LayOffs: కఠిన నిర్ణయం అని తెలుసు, కానీ తప్పడం లేదు - లేఆఫ్‌లపై అమెజాన్ సీఈవో కామెంట్స్