Elon Musk Over EVM Hacking: టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ఈవీఎమ్‌లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ కామెంట్స్‌పై రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ స్పందించారు. మస్క్ ఆరోపణల్ని సమర్థించారు. అయితే...ఈ కామెంట్స్‌పై మాజీ కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తీవ్రంగా స్పందించారు. ఈవీఎమ్‌లు హ్యాక్ అయ్యే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ఇంటర్నెట్‌కి కానీ, బ్లూటూత్‌కి కానీ అవి కనెక్ట్‌ అయి ఉండవని, అలాంటప్పుడు ఎలా హ్యాక్ అవుతాయని ఎదురు ప్రశ్నించారు. అది కేవలం ఓట్లు ఎన్ని పోల్‌ అయ్యాయో లెక్కించి ఆ వివరాలను మాత్రమే స్టోర్ చేసుకుందని స్పష్టం చేశారు. ఇదే విషయమై ANIతో మాట్లాడిన రాజీవ్ చంద్రశేఖర్ మస్క్‌కి చురకలు అంటించారు. ఈవీఎమ్‌లు హ్యాక్‌కు గురవుతాయన్న మస్క్ అభిప్రాయం ఏ మాత్రం సరికాదని వెల్లడించారు. టెస్లా కార్‌ హ్యాక్ అవుతుందేమో అని ఊరికే వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలని మందలించారు. ఈ ప్రపంచంలో ఓ ఎలక్ట్రానిక్ పరికరం 100% సేఫ్ అని ఎవరమూ చెప్పలేమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు. 


"ఈవీఎమ్‌లు హ్యాక్ అవ్వడానికి అవకాశమే లేదు. అవి కేవలం ఓట్లు ఎంత పోల్ అయ్యాయో లెక్కగడతాయి. ఆ వివరాలను స్టోర్ చేసుకుంటాయి. వాటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు. బ్లూటూత్‌తోనూ పని లేదు. అలాంటప్పుడు ఎలా హ్యాక్ అవుతాయి. అన్ని ఈవీఎమ్‌లూ హ్యాక్ అవుతాయని మస్క్ అనడం విడ్డూరంగా ఉంది. ఆయన అభిప్రాయంలో వాస్తవం లేదు"


- రాజీవ్ చంద్రశేఖర్, మాజీ కేంద్రమంత్రి






ఎలన్ మస్క్‌పై అసహనం వ్యక్తం చేస్తూనే ప్రశంసలు కురిపించారు రాజీవ్ చంద్రశేఖర్. రాకెట్ సైన్స్‌పై అంత అవగాహన పెంచుకోవడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఇప్పటికే ఆయన చాలా సాధించారని కొనియాడారు. అయితే...తనకు టెక్నాలజీ పట్ల మస్క్‌కి ఉన్నంత అవగాహన లేకపోయినప్పటికీ ఈవీఎమ్‌లు హ్యాక్‌ అవ్వవని మాత్రం కచ్చితంగా చెప్పగలనని వెల్లడించారు. 


"నేను ఎలన్ మస్క్‌ని కాకపోవచ్చు. కానీ నాకు కూడా కొంత వరకూ టెక్నాలజీపై అవగాహన ఉంది. ఈ ప్రపంచంలో ఎక్కడా ఏ ఎలక్ట్రానిక్ డివైజ్ 100% సెక్యూర్ అని చెప్పలేం. టెస్లా కార్‌ని ఎవరైనా హ్యాక్ చేయొచ్చు అంటే ఎలా ఉంటుందో ఈవీఎమ్‌లు హ్యాక్‌ అవుతాయనడమూ అలాగే ఉంటుంది"


- రాజీవ్ చంద్రశేఖర్, మాజీ కేంద్రమంత్రి


Also Read: Bengal Train Accident: బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం, ఎక్స్‌ప్రెస్‌ని ఢీకొట్టిన గూడ్స్‌ - పెరుగుతున్న మృతుల సంఖ్య