Andhra Pradesh news: పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్న చంద్రబాబు నేరుగా వెళ్లి పరిశీలించారు. అనుకున్నట్టుగానే ఉదయం 11 గంటలకు విజయవాడ నుంచి పోలవరం చేరుకున్నారు. హెలికాప్టర్‌లో అక్కడకు చేరుకున్న చంద్రబాబు... నేరుగా పోలవరం సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. కొన్నేళ్లుగా సాగుతున్న పనుల గుర్తించి అడిగి తెలుసుకున్నారు.
సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత జలవనరుల శాఖాధికారులతో సమావేశమై పోలవరం పురోగతి గురించి అడిగారు. వారి ఇచ్చిన సమాధానాలపై సంతృప్తి చెందని చంద్రబాబు.. నేరుగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. అంతే కాకుండా ప్రతి సోమవారం పోలవారంగా మార్చాలని ఎప్పటికప్పుడు అప్‌డేట్ తనకు ఇవ్వాలని సూచించారు.
సాయంత్రం వరకు పోలవరం ప్రాజెక్టు వద్దే చంద్రబాబు ఉంటారు. అక్కడే భోజనం చేసి ప్రాజెక్టు పురోగతి, నిర్వాసితుల ప్రాజెక్టు అంశంపై అధికారులతో మాట్లాడనున్నారు. కొట్టుకుపోయిన మేజర్ కట్టడాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంపై కూడా చర్చిస్తారు. రాబోయే రోజుల్లో వరదలు భారీగా వచ్చే ఛాన్స్ ఉన్నందున ఆ టైంలో కూడా పనులు ఆగకుండా ఎలాంటి జాగ్రత్తలతో కొనసాగించాలనే విషయంపై కూడా చర్చలు జరపనున్నారు.
2020లో వచ్చిన వరదల కారణంగా కీలకమైన కట్టడాలు కొట్టుకుపోయాయి. దీంతో ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టలేదని అంటారు. తాము అధికారం నుంచి దిగే సరిరిక అంటే 2019 నాటికి 75 శాతం పనులు పూర్తి చేశామని టీడీపీ చెబుతోంది. చిత్తశుద్ది ఉండిఉంటే మాత్రం ఈపాటికి పోలవరం పూర్తి అయ్యేదని అంటున్నారు.
సాయంత్రం వరకు పోలవరం వద్దే ఉండబోతున్న చంద్రబాబు మూడు గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. రెండు గంటలకు అధికారులు, ప్రాజెక్టు నిర్వాహకులతో సమీక్ష చేస్తారు. అక్కడ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు ఏ పరిస్థితిలో ఉందో ప్రజలకు తెలియజేసేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 3 గంటలకు నిర్వహించే సమావేశంలో కీలకమైన విషయాలు ప్రజలకు తెలియజేయన్నారు.
నిర్వాసితుల విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరు నిర్వాసితులను అక్కడి నుంచి తరలించారు. మరికొంతమందిని తరలించాల్సి ఉంది. వారికి సరైన ప్యాకేజీ ఇచ్చి వారిని ఒప్పించి అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు షిప్టు చేయాల్సి ఉంటుంది. వారి ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్రం చెబుతోంది. అంత బడ్జెట్ లేదని... పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ఉన్నందున కేంద్రమే భరించాలని వాదిస్తోంది. దీంతో ఈవిషయం 2014 నుంచి పెండింగ్‌లో ఉంది.