Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టు సందర్శించనున్నారు. ఈ మధ్య పోలవరంపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు పనులపై అధికారులు చెప్పిన వివారాలపై సంతృప్తి చెందలేదు. అందుకే నేరుగా సందర్శించిన తర్వాత అవగాహన వస్తుందని అభిప్రాయపడ్డారు. ఇకపై ప్రతి సోమవారం పోలవారంగా మారుస్తున్నట్టు పేర్కొన్నారు. నేటి సందర్శనతో ఇది ప్రారంభమవుతుందని తెలిపారు. 


సాయంత్ర వరకు పోలవరంలోనే 


ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రెండో రోజే పోలవరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు చంద్రబాబు. అధికారులతో మాట్లాడి సోమవరం ప్రాజెక్టు సందర్శనకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పోలవరం సందర్శనకు వెళ్లనున్న సీఎం... సాయంత్రం వరకు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 12 నుంచి 1.30 వరకు పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తారు. 2 గంటల నుంచి గంటపాటు పనులను పరిశీలిస్తారు. అక్కడ అధికారులతో మాట్లాడతారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత నాలుగు గంటలకు అక్కడి నుంచి తిరుగుముఖం పడుతారు. 


అప్పట్లో సోమవారం పోలవారం 


2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం పేరు తరచూ వినిపించేది. ప్రతి సోమవారం పోలవరంపై ఆయన సమీక్ష చేసే వాళ్లు. క్షేత్రస్థాయి పర్యటనకు కూడా వెళ్లే వాళ్లు. తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ ఆ మాటవినిపిస్తోంది. కచ్చితంగా పోలవరం వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో ఆయన ఉన్నారు. అందుకే యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలన్న ఆలోచనతో అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. 


జగన్ హయాంలో ఆరోపణలతో సరి 


పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని అప్పటి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. దాని పరిస్థితి ఏంటీ... కొత్తగా నిర్మించాలా... ఉన్నదే పటిష్ట పరచాలాా అన్నది ఈ సమావేశం తేలే అవకాశం ఉంది. ఇప్పటికే దీన్ని డీడీఆర్‌పీ సందర్శించి పలు చేసిన ప్రతిపాదనలు ఇంత వరకు అమలు జరగలేదు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 600 కోట్లు అవసరం అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఖర్చు ఎవరు భరిస్తారనే సందిగ్ధంలో పనులు ఆలస్యమవుతున్నాయి. 


ముందడుగు వేయని కేంద్రం 


పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన కేంద్రం నిధులు ఇవ్వడంలో మాత్రం చొరవ చూపడం లేదు. దీంతో రాష్ట్ర నిధులతో కొంత వరకు పనులు ముందుకు సాగుతున్నాయి. నాబార్డు రుణ సాయంతో ప్రాజెక్టులో పురోగతి చూపిస్తున్నారు. ఇప్పుడు సాగుతున్న పనుల తీరుతో ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తి కాదని రాజ్య సభలోనే కేంద్రమంత్రులు స్పష్టం చేశారు. కీలకమైన నిర్మాణాలు తమ హయాంలోనే పూర్తి చేశామని టీడీపీ నేతలు చెబుతున్నారు. అవన్నీ కొట్టుకుపోయాయని మొన్నటి వరకు వైసీపీ నేతలు చెబుతూ వచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి ఇచ్చిన అంచనా వ్యయాన్ని ఇంత వరకు కేంద్రం ఆమోదించలేదు. 55,548 కోట్లు అంచనా వ్యయాన్ని అడ్వైజరీ కమిటీ, ఆర్థిక మాత్రం దీనిపై ఇంత వరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రాజెక్ట పురోగతి 2022 నుంచి అతీగతీ లేకుండా పోయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వంలోనైనా ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. 


చంద్రబాబు పర్యటన కీలకం 


పోలవరం ప్రాజెక్టు సందర్శించనున్న చంద్రబాబు అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి తెలుసుకోనున్నారు. ఇప్పటికే డయాఫ్రంవాల్, గైడ్ బండ్ ధ్వంసమైన వేళ ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనే విషయంపై అధికారులతో సమాలోచన జరపనున్నారు. ప్రాజెక్టు ఆలస్యమైనందున అంచనా వ్యయం కూడా పెరిగిపోతోంది. 2018లో 55,548.87 కోట్ల అంచనాతో కేంద్ర అనుమతి కోరారు. ఇప్పుడు అది 70 వేల కోట్లకు చేరి ఉంటుందని నిపుణులు అభిప్రాపడుతున్నారు. వీటిని మళ్లీ సవరించి కేంద్రం ఆమోదం పొందడమే కాకుండా నిధులు విడుదల అయ్యేలా ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుంది. ఇప్పుడు నేరుగా ప్రాజెక్టు పరిస్థితి తెలుసుకోనున్న చంద్రబాబు దీనిపై ఓ నిర్ణయానికి రానున్నారని తెలుస్తోంది. అందుకే ఈ పర్యటన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మలుపుగా టీడీపీ నేతలు చెబుతున్నారు.