Uttarakhand Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రుద్ర ప్రయాగ్‌లో టెంపో ట్రావెలర్‌ అదుపు తప్పి ఓ లోయలో పడింది. ప్రమాద సమయంలో టెంపోలో 23 మంది ప్రయాణికులున్నారు. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. రిషికేశ్ బద్రినాథ్ హైవేలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు. అయితే...ప్రమాద సమయంలో ఎంత మంది టెంపోలో ఉన్నారన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రాథమికంగా 23 మంది ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులతో పాటు SDRF సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.






ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. గాయపడ్డ వారిని రిషికేశ్‌లోని AIIMSకి తరలించి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. వైద్య సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అంతకు ముందు ఓ ట్వీట్ చేశారు. ఈ ఘటన ఎంతో దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు. SDRF సిబ్బంది సహాయక చర్యలు చేపడుతోందని వివరించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.  






ఈ ఘటనపై హోం మంత్రి అమిత్ షా కూడా స్పందించారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. గాయపడ్డ బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


"రుద్రప్రయాగ్‌లో జరిగిన ప్రమాదం దిగ్భ్రాంతి కలిగించింది. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. స్థానిక అధికార యంత్రాంగంతో పాటు SDRF సిబ్బంది కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతోంది. బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను"


- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి






Also Read: G7 Summit: స్మైల్ ప్లీజ్, G7 సమ్మిట్‌లో మెలోని మోదీ స్పెషల్ సెల్ఫీ - ఫొటో వైరల్