Heeraben Death: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి మృతిపై తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రాజకీయ ప్రమఖులు సంతాపం తెలియజేస్తున్నారు. హీరాబెన్ మోదీ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో దేశమంతా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి శ్రీమతి హీరాబెన్ మోదీ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మోదీజీకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. హీరాబెన్ మృతికి శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు వవరించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హీరాబెన్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
హీరాబెన్ మోదీ ఆ భగవంతుడి పాదాలను చేరుకున్నారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు. ఈ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు వివరించారు. ప్రధాని మోదీకి జరిగిన ఈ నష్టానికి దేశ ప్రజలంతా అండగా ఉంటారని ట్వీట్ చేశారు. ఆ బాధను తట్టుకునే శక్తిని ప్రధానికి ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
హీరాబెన్ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని, విచారాన్ని వ్యక్తం చేస్తున్నానని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. శుక్రవారం రోజు ఉదయమే ప్రధాని మోదీ తల్లి మృతి చెందారని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
తల్లీ బిడ్డ అనుబంధం వెలకట్టలేనిది: వెంకయ్య
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి మరణ వార్త తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. తల్లీ బిడ్డల మధ్య ఉన్న బంధం వెల కట్టలేనిదన్నారు. దేవుడి సృష్టిలో ఇంతకంటే విలువైనది ఏదీ లేదన్నారు. ఆ బంధం వర్ణించడానికి కూడా మాటలు సరిపోవని ట్వీట్ చేశారు. హీరాబెన్ ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థించారు.
ప్రధాని మాతృమూర్తి శ్రీమతి హీరాబెన్ స్వర్గస్తులయ్యారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మొదటి దైవం, తొలి గురువు అయిన తల్లిని కోల్పోతే ఉండే దుఖం తనకు తెలుసని.. ఈ బాధాకర సమయంలో ప్రధానికి, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు.
తల్లి హీరాబెన్ మృతి వార్త తనను తీవ్రంగా కలిచి వేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఈ విషాధ సమయంలో కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు.
హీరాబెన్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఏపీ బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. ఈ సృష్టిలో ఏ జీవికైనా తొలి గురువు , ఎలాంటి పరిస్థితుల్లోనైనా దైవంగా భావించదగిన సర్వోన్నతమైన స్థానం అమ్మదని సోము వీర్రాజు తెలిపారు. విశ్వం మెచ్చిన ధీరోదాత్తమైన నాయకుడికి జన్మనిచ్చిన తల్లిగా మీ ప్రస్థానం మాకు చిరస్మరణీయం అంటూ ట్వీట్ చేశారు.
ప్రధాని మాతృమూర్తి హీరాబెన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నానని నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు వివరించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రధాని మోదీ తల్లి మృతిపై ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మోదీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.