Minister Ponnam Launched New Buses: తెలంగాణ (Telangana) ఆర్టీసీకి మరో 80 కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కొత్త ఆర్టీసీ బస్సులను శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రారంభించారు. ఇందులో 30 ఎక్స్ ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ అండ్ సీటర్ బస్సులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar), అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ పరిరక్షణకు పెద్దపీట వేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పారని మంత్రి తెలిపారు. సీసీఎస్ బకాయిలు త్వరలోనే విడుదల చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. ఆర్టీసీ నష్టాలు తీరుస్తామని, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంతో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇంకా అదనపు సర్వీసులు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం అత్యాధునిక హంగులతో బస్సులు అందుబాటులోకి తెచ్చామన్నారు.

Continues below advertisement


త్వరలోనే వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు 


రాష్ట్రంలో త్వరలోనే వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. అందులో 500 బస్సులు నగరంలో, మిగిలిన బస్సులు జిల్లాల్లో తిప్పుతామని చెప్పారు. ఈ బస్సులన్నీ విడతల వారీగా మార్చి, 2024 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 'మహాలక్ష్మి' పథకం ప్రారంభించినప్పటి నుంచి 20 రోజుల్లో రోజుకు 30 లక్షల మంది ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం ఉపయోగించుకుంటున్నారని సజ్జనార్ వెల్లడించారు. మరోవైపు, ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1,050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. 


భూములు లీజికివ్వనున్న ఆర్టీసీ


మరోవైపు, నిధుల సమీకరణకు  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తమకున్న భూములను లీజుకివ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. కాచిగూడలోని 4.143 ఎకరాలు, మేడ్చల్ లో 2.83 ఎకరాలు, శామీర్ పేటలో 3.26 ఎకరాలు, హకీంపేటలో 2.93 ఎకరాలు కలుపుకొని మొత్తం 13.16 ఎకరాల లీజు ప్రక్రియను ప్రారంభించింది. ఆన్ లైన్ లో టెండర్ దరఖాస్తులు ఆహ్వానించగా, జనవరి 18 వరకూ టెండర్లు దాఖలు చెయ్యొచ్చు. ఆసక్తి గల వారు వివరాల కోసం https://www.tsrtc.telangana.gov.in/ సైట్ చూడాలని అధికారులు సూచించారు.


Also Read: Telangana News: ఫ్రీ బస్ ఎఫెక్ట్ - మహిళలతో నిండుతున్న ఆర్టీసీ బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తోన్న పురుషులు