Scene Reverse Due to Free Bus Effect: కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలకు ఆర్టీసీ ప్రయాణం ఫ్రీ కావడంతో మహిళలు రెట్టించిన ఉత్సాహంతో బస్సులు ఎక్కేస్తున్నారు. ఎటు చూసిన బస్సుల్లో తీవ్ర రద్దీ నెలకొంటోంది. కనీసం కాలు కూడా మోపలేనంతగా బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ ఆక్యుపెన్సీ విషయంలోనూ మంచి రోజులొచ్చాయి. అయితే, రద్దీ దృష్ట్యా కొన్ని ఇబ్బందులు సైతం ఏర్పడుతున్నాయి. డబ్బులిచ్చి నిలబడాల్సి వస్తోందని మగవారు వాపోతున్నారు. మగవారికి ప్రత్యేక సీట్లు సైతం కేటాయించాలని, బస్సుల సర్వీసులు పెంచాలని డిమాండ్లు వస్తున్నాయి.


మారిన పరిస్థితి


ఫ్రీ బస్ సర్వీస్ అమలు కాక ముందు వరకూ ఎక్కువ శాతం మహిళలు క్యాబ్స్, షేర్ ఆటోలనే ఆశ్రయించేవారు. విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు, చిరుద్యోగులు ఇలా ఆటోల్లో అధికంగా ప్రయాణించేవారు. అయితే, ఉచిత బస్సు ప్రయాణంతో సీన్ రివర్స్ అయ్యింది. ఎక్కువ శాతం పురుషులు ఇప్పుడు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. భాగ్యనగరంలో ఒకప్పుడు ఆడవాళ్లతో నిండిపోయే ఆటోలు ఇప్పుడు మగవారితో నిండి కనిపిస్తున్నాయి. అయితే, ఉచిత బస్సు ప్రయాణం వల్ల తమ ఉపాధికి గండి పడిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో రోజుకు 3 ట్రిప్పులు నడిపేవారిమని, ఇప్పుడు ఒక ట్రిప్పు కూడా నడపడం కష్టంగా ఉందని వాపోతున్నారు. ఆడవాళ్లు ఆటో నిండే వరకూ సహనంతో వేచి ఉండే వారని, ఇప్పుడు మగవాళ్లు వేచి ఉండేందుకు ఇష్టపడడం లేదని, దీంతో వచ్చే ఆదాయంలో సగానికి పైగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ ఫ్రీ కాకుండా విద్యార్థులు, వృద్ధులు ఇలా కొన్ని నిబంధనలు పెడితే బాగుంటుందని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ కుటుంబాలు రోడ్డున పడటం ఖాయమంటూ వాపోతున్నారు.


Also Read: Telangana News: 'ప్రజాపాలన'కు దరఖాస్తుల వెల్లువ - వివరాలపై ఎన్ని సందేహాలో!