Some Confusions in Application Process: తెలంగాణ (Telangana) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజాపాలన' (Prajapalana) కార్యక్రమం కొనసాగుతోంది. 5 గ్యారెంటీలకు సంబంధించి లబ్ధి కోసం దరఖాస్తులు సమర్పించేందుకు ప్రజలు గ్రామ, వార్డు, డివిజన్ సభలకు పోటెత్తుతున్నారు. ఈ నెల 28 (గురువారం) నుంచి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా, తొలి రోజు 7,46,414 అర్జీలు రాగా, రెండో రోజు రాష్ట్రవ్యాప్తంగా 8,12,862 అర్జీలు వచ్చాయి. జీహెచ్ఎంసీ, ఇతర కార్పొరేషన్లు, పట్టణాల్లో 4,89,000 దరఖాస్తులు రాగా, గ్రామాల్లో 3,23,862 అప్లికేషన్స్ వచ్చాయి. దరఖాస్తులు ఉచితంగానే ఇస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ, కొన్ని చోట్ల కేంద్రాల సమీపంలో బయటి వ్యక్తులు రూ.20 నుంచి రూ.100కు ఫారాలు విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా కొందరు జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు సైతం అర్జీదారుల నుంచి వసూళ్లకు పాల్పడ్డారు. కానీ, జిరాక్స్ తీసిన దరఖాస్తులను అధికారులు తిరస్కరించడంతో ప్రజలు నిరాశ చెందారు.


ఉదయం నుంచే బారులు


'ప్రజాపాలన'లో భాగంగా ఉదయం 8 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సభలు నిర్వహిస్తున్నారు. అయితే, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, కొన్ని చోట్ల పట్టణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచే జనం కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఎక్కువ మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇవే కాకుండా గృహజ్యోతి, మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలకు సైతం అధిక సంఖ్యలో అప్లై చేసుకుంటున్నారు. కొన్ని కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తాగునీరు కూడా ఏర్పాటు చేయలేదని వాపోయారు. కామారెడ్డి జిల్లా బీర్కూరులో దరఖాస్తులు కొరతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల నిరక్ష్యరాస్యులు దరఖాస్తులు నింపలేకపోవడంతో కొందరు డబ్బులు తీసుకుని వాటిని నింపారు.


ఎన్ని సందేహాలో.?



  • దరఖాస్తులు నింపి అధికారులకు ఇచ్చే సమయంలో ప్రజల నుంచి పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. రేషన్ కార్డు స్వగ్రామంలో ఉండగా, కుటుంబంతో హైదరాబాద్ లో ఉంటున్నామని, తాను ఎక్కడ దరఖాస్తు చేయాలి.? అనే సందేహం కొందరు వెలిబుచ్చారు.

  • అలాగే, గ్యాస్ కనెక్షన్లు మగవారి పేరు మీద ఉన్నాయి. రాయితీతో రూ.500కు సిలిండర్ వస్తుందా.? కనెక్షన్ మార్పించుకోవాలా.? అంటూ ప్రశ్నించారు. అయితే, వీటిపై అధికారుల నుంచి కూడా ఎలాంటి స్పష్టత రాలేదు.

  • ఫారం 4 పేజీల్లోనూ ఎక్కడా లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతా నెంబర్ ప్రస్తావించలేదు. దీంతో చాలా మందిలో నగదు సహాయం ఎక్కడ జమ చేస్తారు అనే సందేహం నెలకొంది.

  • ఒక ఇంట్లో 2 కంటే ఎక్కువ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. కొన్ని ఇళ్లల్లో అద్దెకు ఉంటున్నవారూ ఉంటున్నారు. 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగానికి రాయితీ ఇందులో ఏ కనెక్షన్ కు వర్తిస్తుంది అనే అనుమానాలను అధికారుల వద్ద అర్జీదారులు వ్యక్తం చేశారు. అయితే, ముందు దరఖాస్తులు సమర్పించాలని ఆ తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.


దరఖాస్తులు నింపేందుకు వాలంటీర్లు


మరోవైపు, అన్ని కేంద్రాల్లోనూ ప్రజలకు అవసరమైన దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. రెండో రోజు 'ప్రజాపాలన' కార్యక్రమంపై శుక్రవారం కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలు దరఖాస్తులను డబ్బులు పెట్టి కొనుగోలు చేసే పరిస్థితి తేవొద్దని నిర్దేశించారు. కేంద్రాల వద్ద బారికేడింగ్, తాగునీటి సదుపాయం, టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. దరఖాస్తులు నింపడంలో ప్రజలకు సహకరించేలా వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.


Also Read: BRS News: వాహనాలు కొంటే తప్పేంటి? కేసీఆర్ సొంతానికి కొన్నారా? రేవంత్‌వి పిచ్చి మాటలు-కడియం