BRS News: కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 412 హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిందని.. వాటికి నిధులు సమీకరించలేక శ్వేత పత్రాలు, న్యాయవిచారణల పేరిట డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. ప్రజల ఫోకస్ మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. శ్వేత పత్రాలు న్యాయ విచారణలని స్వాగతిస్తున్నామని.. తామే విచారణలు కోరినట్లు చెప్పారు. 


బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో నేడు (డిసెంబర్ 29) ఐదుగురు మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లడంపై వారు మాట్లాడారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ‘‘అధికారుల పై మంత్రులు ప్రశ్నలు వర్షం కురిపించారు. 


కాళేశ్వరంపై మంత్రుల పర్యటనతో మేము చెబుతున్న వాస్తవాలు తెలిశాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. కానీ 93 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయిందని పీపీటీలో వారే చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఒక్క ఎకరం కూడా కాళేశ్వరం కింద పార లేదన్నారు. వారిచ్చిన నివేదికలోనే 90 వేల ఎకరాల ఆయకట్టు వచ్చిందన్నారు. తుమ్మిడి హట్టి దగ్గర తిరిగి ప్రాజెక్టు చేపడతామని ఉత్తమ్ అంటున్నారు. నాడు వైఎస్ 2008 డిసెంబర్ 16 నాడు ప్రాణహిత కు శంఖుస్థాపన చేశారు. మహారాష్ట్ర అక్కడ ప్రాజెక్టు కు ఒప్పుకోలేదు. 


అక్కడ నీటి లభ్యత లేదని కేంద్ర జల వనరుల సంఘం లేఖ కూడా రాసింది. ఎట్టి పరిస్థితుల్లో 152 మీటర్ల దగ్గర ప్రాజెక్టు కు ఒప్పుకునేది లేదని నాటి మహారాష్ట్ర సీఎం పృథ్వీ రాజ్ చవాన్ స్పష్టం చేసి లేఖ రూపంలో తన నిరసన తెలియజేశారు. మహారాష్ట్ర నిరసనలు తెలిపినా నాడు వైఎస్ శంఖుస్థాపన చేసి తట్టెడు మన్ను తీయలేదు. ఈపీసీ పద్ధతిలో 6 వేల కోట్ల రూపాయల దాకా నాటి ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్సులు కాంట్రాక్టర్లకు చెల్లించింది. అన్నీ అంశాలు పరిగణన లోకి తీసుకుని మహారాష్ట్ర ప్రభుత్వం తో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకుని ప్రాణహిత ప్రాజెక్టును రీ డిజైన్ చేశారు.


అన్ని రకాల అనుమతుల తర్వాతే కాళేశ్వరం అనుమతులు
దాదాపు 11 రకాల అనుమతులు తీసుకున్నాకే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదిత ఆయకట్టు ఎక్కువ గా ఉంది కనుకే అంచనా వ్యయం పెరిగింది. 140 టీఎంసీల మేర సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు కాళేశ్వరం కింద నిర్మించుకున్నాం కనుకే వ్యయం పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు తో పాటు పాత ఆయకట్టును స్థీరీకరించుకున్నాము. మేడిగడ్డలో కొన్ని పిల్లర్లు కుంగిపోవడం దురదృష్టకరం. న్యాయ విచారణ మొదలు కాకముందే మంత్రులు తీర్పులు ఇచ్చేస్తున్నారు. న్యాయ విచారణను మంత్రుల వ్యాఖ్యలు ప్రభావితం చేసేలా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కేసీఆర్ అడగలేదని ఉత్తమ్ అనడం సిగ్గు చేటు. 


నేను డిప్యూటీ సీఎం గా ఉండగా కేసీఆర్ తో పాటు పీఎంను కలిసి కాళేశ్వరంకు జాతీయ హోదా అడిగాం. ఎన్నో సార్లు కేసీఆర్ పీఎం మోదీకి జాతీయ హోదా కోసం లేఖలు రాశారు. పాలమూరు రంగారెడ్డికి కూడా జాతీయ హోదా అడిగాం. కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టుల అంచనాల వ్యయం పెరగడం గురించి విచిత్రంగా మాట్లాడుతున్నారు. శ్రీరాం సాగర్, నాగార్జున సాగర్ అంచనా వ్యయాలు పెరగలేదా? దేశంలో అంచనాలు పెరగకుండా ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయా? పదే పదే ఆయకట్టు పెరగలేదు అంటున్నారు. అదే నిజమైతే తెలంగాణ లో ఇన్ని కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి ఎలా సాధ్యపడుతుంది?


కొత్త వాహనాలు కొంటే తప్పేంటి?
సీఎం రేవంత్ ల్యాండ్ క్రూసర్ వాహనాల గురించి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఆ వాహనాలు కేసీఆర్ సొంతానికి కొన్నారా? ఆ వాహనాల్లో ఈ ప్రభుత్వం వాళ్ళు తిరగరా? కొంటే తప్పేముంది. కేబినెట్ సమావేశంలో ఆ నిర్ణయం తీసుకున్నారు. అది దాస్తే దాగుతుందా? విజయవాడలో బుల్లెట్ ప్రూఫ్ కోసం వాహనాలు తరలించడం పరిపాటే. ఏ సీఎం అయినా సచివాలయంలో లంకె బిందెలు ఉన్నాయని వస్తారా? సచివాలయంలో డబ్బులు ఉంటాయా? మన బడ్జెట్ తెలిసే ఇప్పటి ముఖ్యమంత్రి అన్ని హామీలు ఇచ్చాడా? ఆ హామీలు అమలు చేయడానికి ఎన్ని బడ్జెట్ లు కావాలి? కాంగ్రెస్ అంటేనే అవినీతికి పేటెంట్. కాంగ్రెస్ కు అందుకే స్కాంగ్రెస్ గా పేరు వచ్చింది’’ అని కడియం శ్రీహరి మాట్లాడారు.