Resignation from YSRCP :  వైఎస్ఆర్‌సీపీ  ప్రాథమిక సభ్యత్వానికి బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ రాజీనామా చేశారు. విశాఖ దక్షిణలో జరుగుతున్న పరిణామాలతో రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ఈమేరకు సీఎం జగన్‌కు లేఖ పంపారు. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సుధాకర్‌ రాజీనామా చేయడం పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. వైస్సార్, విజయమ్మలకు అత్యంత నమ్మకస్థుడిగా ఉన్నారు సీతంరాజు సుధాకర్. రెండు దశాబ్దాలుగా వైస్సార్, వైసీపీ లకు విధేయుడిగా ఉన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. విశాఖ సౌత్ టికెట్ ను సీతంరాజు సుధాకర్ ఆశించారు. 


సౌత్ ఇంఛార్జి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే సీఎం  జగన్  వచ్చే ఎన్నికల్లో వాసుపల్లికే టిక్కెట్ ఖరారు చేశారు.  గతంలో టికెట్ దక్కించుకోవడంలో విఫలమైన ఆయన.. బ్రాహ్మణకార్పోరేషన్ ఛైర్మన్ గానూ, వీఎంఆర్డీఏ ఛైర్మన్ గానూ నామినేటెడ్ పదవులు దక్కించుకున్నారు. అయితే వైజాగ్ దక్షిణ నియోజకవర్గం నుంచి ఈసారి పోటీ చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ మేరకు చివరి నిమిషం వరకూ తనకు టికెట్ దక్కుతుందనే ఆశతో ఉన్నారు. అది కాస్తా ఫెయిల్ కావడంతో సీతంరాజు ఇవాళ వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీకి ఎంతో నమ్మకంగా పనిచేసిన సుధాకర్ రాజీనామ చేయడంతో అధికార పార్టీ వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది.  


విశాఖ దక్షిణ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్లు పేర్కొంటూ సీఎం జగన్ కు ఇవాళ ఆయనో లేఖ రాశారు. ఇందులో సీతంరాజు సుధాకర్ విశాఖ దక్షిణంలో తనకు టికెట్ దక్కకపోవడం వెనుక కారణాలను, వైసీపీలో వర్గ విభేదాలను వివరించినట్లు సమాచారం. ఈ పరిణామాలతో విసిగిపోయి తాను వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్లు సీతంరాజు సుధాకర్ ప్రకటించారు.  విశాఖలో సౌత్ నియోజకవర్గం నుంచి గతంలో ద్రోణం రాజు సత్యనారాయణz ద్రోణంరాజు శ్రీనివాస్ లాంటి బ్రాహ్మణ నేతలు ఎమ్మెల్యేలుగా పనిచేసి ఉండడం, అక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గ ఓట్లు కూడా అధికంగా ఉండడం తో అక్కడి నుంచి పోటీ చేయాలని సుధాకర్ కోరుకున్నారు. 


టీడీపీ నుంచి ఫిరాయించి వచ్చిన గణేష్ పై అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్ ల మద్దతుతో టిక్కెట్కోసం ప్రయత్నించారు.  సుధాకర్ నియోజకవర్గంలో కీలక సమావేశాలు నిర్వహిస్తూ చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు.   పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో సీతంరాజు సుధాకర్ ని వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా బరిలోకి దింపింది వైసీపీ అధిష్టానం. దీంతో ఇక సుధాకర్ బెడద దక్షిణ నియోజకవర్గానికి ఉండదని గణేష్ కి భరోసా ఇచ్చింది వైఎస్ఆర్సిపి అధిష్టానం. అయితే అది ఎంతో కాలం నిలవలేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ఆర్సిపి ఓటమి చెందడంతో మళ్లీ దక్షిణ నియోజకవర్గంపై దృష్టి సారించారు సీతం రాజు సుధాకర్. నిరాశ ఎదురు కావడంతో పార్టీకి గుడ్ బై చెప్పారు.