PG Gold Medal To Prisoner: ఈ రోజుల్లో చాలా మంది విద్యార్థులకు జీవితం విలువ తెలీదు. తల్లిదండ్రులు అన్ని సమకూర్చి పెట్టి... బుద్ధిగా చదువుకోండి అని చెప్పినా  చెవికెక్కించుకోరు. కానీ.. కొందరుంటారు... అవకాశాలు తక్కువ ఉన్నా... వచ్చినవాటినే అందిపుచ్చుకుని.. ఆణిముత్యాలుగా మారుతారు. స్టూడెంట్‌ నెంబర్‌-1  అనిపించుకుంటున్నారు. అలాంటి ఓ స్టూడెంట్‌ కథే ఇది. 


స్టూడెంట్‌ నంబర్‌ –1 సినిమా... అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో... హత్య కేసులో శిక్ష పడిన యువకుడు... జైలు అధికారుల సహకారంతో, పట్టుదలతో లా కోర్సు  పూర్తిచేసి లాయర్‌ పట్టా సాధిస్తాడు. తండ్రి ఆశ నెరవేరుస్తాడు. అచ్చం అలానే... ఇప్పుడు కడప జైల్లో(KADAPA PRISON) కనిపిస్తున్నాడు స్టూడెంట్‌ నెంబర్‌-1. యావజ్జీవ కారాగార శిక్షపడిన ఆ రఫీ అనే యువకుడు చదువుపై ఇష్టంతో... జైలు నుంచే కష్టపడి చదివి పీజీలో గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. అందరి ముందు... గోల్డ్‌ మెడల్‌ అందుకున్నాడు.


గోల్డ్‌ మెడల్‌ సాధించిన రఫీ కథ..!
నంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసోముల గ్రామానికి చెందిన దూదేకుల నడిపి మాబుసా-మాబున్నీ కుమారుడు మహమ్మద్‌ రఫీ (Mohammad Rafi). 2014లో బీటెక్‌ చదివేవాడు. ఆ సమయంలో ప్రేమ వ్యవహారం చిక్కుకున్నాడు. తన గ్రామానికే చెందిన ఓ యువతి హత్యకు కారణమయ్యాడని భావించి ఆ యువకుడిపై హత్యకేసు నమోదైంది. కోర్టులో విచారణ తర్వాత... 2019 జూలైలో రఫీకి జీవితఖైదు పడింది. అప్పటి నుంచి కడప కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే... అక్కడి జైలు అధికారులు చదువుపై ఆసక్తి ఉన్న వారిని గుర్తించారు. టెన్త్‌ వరకు చదివిన వారిని దూర విద్య కోర్సుల ద్వారా ఉన్నత చదువులు చదివేందుకు ప్రోత్సహించారు. శిక్షపడే నాటికే డిగ్రీ పూర్తి చేసిన మహమ్మద్‌ రఫీకి చదువుపై ఉన్న ఇష్టాన్ని గుర్తించిన అప్పటి జైలు అధికారులు... ఉన్నత చదువులు చదివేందుకు అతన్ని ప్రోత్సాహించారు. 2020లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (Dr. BR Ambedkar Open University)లో పీజీ చేసేందుకు అవకాశం కల్పించారు.


యావజ్జీవ శిక్ష పడి... జీవితంలో ఇకేమీ మిగల్లేదనే నిరాశలో ఉన్న ఆ యువకుడు... వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఎంఏ సోషియాలజీలో అడ్మిషన్‌ పొందాడు. కావాల్సిన స్టడీ మెటీరియల్‌ను సమకూర్చుకుని జైలులోనే చదువుకున్నారు. నాలుగు గోడల మధ్య... వీలైంత సమయం చదువుకునేందుకే వినియోగించాడు. కోర్టు ఆదేశాలతో జైలు అధికారులు 2022లో మహమ్మద్‌ రఫీని పరీక్షలకు అనుమతి ఇచ్చారు. పరీక్షా ఫలితాల్లో టాపర్‌గా నిలిచారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పరిధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఎంఏ సోషియాలజీలో మొదటి ర్యాంకు సాధించాడు. గోల్డ్‌ మెడల్‌ (PG Gold medal) సాధించాడు. 


జైల్లో శిక్ష అనుభవిస్తున్న మహమ్మద్‌ రఫీకి పీజీ పట్టా, గోల్డ్‌ మెడల్‌ ప్రదానం చేయాలని యూనివర్సిటీ అధికారులు ఇటీవల జైలు అధికారులకు సమాచారం అందించారు.  దీంతో పోలీసులు కోర్టు అనుమతి తీసుకున్నారు. రఫీకి నాలుగు రోజులు బెయిల్‌ మంజూరు కావడంతో... గురువారం (డిసెంబర్‌ 28న) హైదరాబాద్‌లోని అంబేడ్కర్‌  యూనివర్సిటీలో వైస్‌ చాన్స్‌లర్‌ జగదీశ్‌ ఆధ్వర్యంలో గోల్డ్‌మెడల్‌ బహూకరించారు. స్టూడెంట్‌ నెంబర్‌-1 అనిపించుకున్న రఫీకి అభినందనలు తెలియజేశారు. పీజీలో గోల్డ్‌  మెడల్‌ వచ్చినందుకు పొంగిపోయాడు రఫీ. తన జీవితం జైలు పాలు అయినప్పటికీ... చదువుపై ఉన్న ఇష్టంతో కష్టపడి పట్టుదలతో చదివినట్టు చెప్పాడు. జైల్లో దొరికిన  మెటీరియల్‌ను ఉపయోగించుకుని పీజీ పట్టా సాధించానని సంతోషం వ్యక్తం చేశాడు. తాను సాధించిన గోల్డ్‌ మెడల్‌ తన తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నట్టు చెప్పాడు  మహమ్మద్‌ రఫీ.