Ram Gopal Varma Vyooham Movie: వ్యూహం సినిమా విడుదల విషయంలో తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వు చేసి ఉంచింది. శుక్రవారం ఈ తీర్పును వెలువరించనున్నారు. ‘వ్యూహం’ సినిమాకు సీబీఎఫ్‌సీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను నిలిపివేస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని ఆ సినిమా నిర్మాత తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. వ్యూహం సినిమాను కనీసం సంక్రాంతి పండుగకు తాము రిలీజ్‌ చేసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని నిర్మాత తరఫు లాయర్‌ హైకోర్టులో వాదించారు. సెన్సార్‌ బోర్డు పది మందితో రివ్యూ కమిటీ వేసి నిర్ణయం తీసుకున్న తర్వాతే సినిమాకు సర్టిఫికెట్‌ ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు విడుదల చేయలేకపోతే యువత పరీక్షల బిజీలో పడిపోతుందని, అప్పుడు సినిమాలు ఏవీ రిలీజ్ కావని అన్నారు.


చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యూహం సినిమా తెరకెక్కించారని, అందుకే ఆ సినిమాకు సీబీఎఫ్‌సీ ధ్రువీకరణ పత్రం జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ నారా లోకేశ్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఒకవేళ ఏపీలో ఎన్నికలపై ప్రభావం ఉంటుందని అనుకుంటే, తెలంగాణలోనైనా విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.