Governor Tamilisai Responds on Resignation News: తెలంగాణ గవర్నర్ (Telangana Governor)గా తాను రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను తమిళిసై (Tamilisai) ఖండించారు. రాష్ట్ర గవర్నర్ గా తాను సంతోషంగా ఉన్నానని, నిరాధారమైన వార్తలను ప్రచారం చెయ్యొద్దన్న గవర్నర్, తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా నెరవేరుస్తానని, ఏదైనా నిర్ణయం ఉంటే తెలియజేస్తానని చెప్పారు. రాజకీయాలు అనేవి తన కుటుంబ నేపథ్యంలోనే ఉన్నాయని పేర్కొన్నారు. 'నేను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటాను. ప్రస్తుతం తెలంగాణ, పుదుచ్చేరి (Puducherry) గవర్నర్ గా ఉంటున్నా. ప్రధాని మోదీ (PM Modi), రాముడి దయతో విధులు నిర్వహిస్తున్నా. ఎంపీగా పోటీ చేస్తానని ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు. ఢిల్లీ వెళ్లి ఎలాంటి రిక్వెస్ట్ చేయలేదు. వరద బాధితులను పరామర్శించేందుకు తూత్తుకుడి వెళ్లి వచ్చా.' అని తమిళిసై తెలిపారు.
కాగా, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆమె ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ కోసమే హస్తినకు వెళ్లారని, సొంత రాష్ట్రం తమిళనాడు నుంచే ఆమె పోటీ చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపించాయి. ఈ రూమర్స్ పై తమిళిసై పూర్తి క్లారిటీ ఇచ్చారు.
ఇంతకు ముందు అక్కడ పోటీ
అయితే, తమిళిసై గతంలో రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తుకుడి నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. మరో మూడు సార్లు అసెంబ్లీకి పోటీ చేసినా, విజయం సాధించలేదు. దీంతో పార్టీకి ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్ లో తమిళిసైను తెలంగాణ గవర్నర్ గా నియమించారు. 2021 నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు.