Ayodhya Mandir Opening:


బీజేపీపై అసహనం..


ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే శివసేన నేత సంజయ్ రౌత్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. అయోధ్య రామ మందిరాన్ని రాజకీయం చేస్తోందంటూ మండి పడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాముడిని అభ్యర్థిగా ప్రకటించడం ఒక్కటే మిగిలుందని సెటైర్లు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య పర్యటన నేపథ్యంలో సంజయ్ రౌత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు అయోధ్య ప్రారంభోత్సవ వేడుకల్లో స్వచ్ఛత అనేదే లేకుండా పోయిందని, కేవలం బీజేపీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కార్యక్రమాన్ని వాడుకుంటోందని విమర్శించారు. 


"అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని బీజేపీ పూర్తిగా రాజకీయం చేస్తోంది. త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి. బహుశా రాముడిని అభ్యర్థిగా ప్రకటించడం ఒక్కటే మిగిలి ఉందేమో. కేవలం రాముడి పేరు చెప్పుకుని ఇన్ని రాజకీయాలు చేస్తోంది బీజేపీ"


- సంజయ్ రౌత్, UBT శివసేన ఎంపీ


గతంలోనూ..


గతంలోనూ రౌత్‌ అయోధ్య రామ మందిరంపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అయోధ్య ఉత్సవం కేవలం బీజేపీ ఈవెంట్ అని...దానికి దేశానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఉద్దవ్ థాక్రే వెళ్తారా అన్న ప్రశ్నకు సంజయ్ రౌత్‌ సమాధానమిచ్చారు. బీజేపీ స్పాన్సర్ చేసిన ఈ కార్యక్రమాలన్నీ ముగిసిన తరవాతే ఆయన అయోధ్యను సందర్శిస్తారని వెల్లడించారు. 


"అయోధ్యలో బీజేపీ ఈవెంట్స్‌ అన్నీ పూర్తయ్యాక ఉద్దవ్ థాక్రే తప్పకుండా అయోధ్య రాముడిని దర్శించుకుంటారు. అయినా బీజేపీ ఈవెంట్‌కి మేమెందుకు వెళ్లాలి..? ఇందుకోసం ఆ పార్టీ చాలా ఆర్భాటం చేస్తోంది. అందులో ఎక్కడా స్వచ్ఛతా కనిపించడం లేదు"


-  సంజయ్ రౌత్, UBT శివసేన ఎంపీ


ప్రాణప్రతిష్ఠ జరిగే ముందే కీలక కార్యక్రమాలు నిర్వహించనుంది ట్రస్ట్. జనవరి 17న బాలరాముడి విగ్రహ అయోధ్యకు చేరుకుంటుంది. అదే రోజున భక్తులు మంగళ్ కలశంలో సరయు నది నీళ్లు తీసుకొస్తారు. జనవరి 18న గణేశ్ పూజతో కార్యక్రమం మొదలవుతుంది. ఆ తరవాత వరుణ పూజ, మాత్రిక పూజ, వాస్తు పూజలు జరుగుతాయి. జనవరి 19వ తేదీన హోమం చేయనున్నారు. జనవరి 20న వాస్తు శాంతి చేస్తారు. జనవరి 21వ తేదీన రాముడి విగ్రహానికి అభిషేకం జరుగుతుంది. ఇక చివరగా జనవరి 22న మృగశిర నక్షత్రంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది.