Civil Supplies Department Key Proposal on 500 Rupees Gas Cylinder: తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో రూ.500లకే గ్యాస్ సిలిండర్ ప్రధానమైనది. 'మహాలక్ష్మి' (Mahalaxmi) పథకంలో భాగమైన సబ్సిడీ సిలిండర్ (Subsidy Cylinder) పంపిణీపై ఇప్పటికే పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. తాజాగా రూ.500లకే గ్యాస్ సిలిండర్ పంపిణీకి సంబంధించి లబ్ధిదారుల ఎంపికపై ఆ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న వారికే ఈ పథకం వర్తింపచేసే అవకాశాలున్నట్లు సమాచారం. లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకోవడం ద్వారా సిలిండర్లు దుర్వినియోగం కాకుండా ఉంటాయని ప్రతిపాదించినట్లు తెలిసింది. వంద రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు  చేస్తామన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ పథకానికి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని భావిస్తోంది. అయితే, రేషన్ కార్డులతో సంబంధం లేకుండా అర్హులను ఎంపిక చేయాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ అది అమలు చేయాలంటే చాలా సమయం పడుతోందని, లబ్ధిదారుల ఎంపిక కష్టం అవుతుందని యోచిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం కలెక్టర్లతో నిర్వహించే సమావేశంలో ఈ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


రేషన్ కార్డుల లెక్క ఇదే


రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, రేషన్ కార్డుల సంఖ్య 89.98 లక్షలుగా ఉంది. 'గివ్ ఇట్ అప్'లో భాగంగా 4.2 లక్షల మంది రాయితీ వదులుకున్నారు. వీరిని మినహాయిస్తే లబ్ధిదారుల సంఖ్య 85.79 లక్షలుగా ఉంది. అయితే, రేషన్ కార్డు డేటా బేస్ తో మ్యాపింగ్ అయిన గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 63.6 లక్షలుగా ఉంది. మరోవైపు, 'ఉజ్వల' గ్యాస్ కనెక్షన్లకు రూ.340 రాయితీ అందుతుండగా, మొత్తం కనెక్షన్లలో వీటి సంఖ్య 11.58 లక్షలు ఉంది. 


6 లేక 12.?


రాయితీ సిలిండర్లు ఏడాదికి ఆరు ఇవ్వాలా.? లేక పన్నెండా.? అనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఇందుకోసం అర్హులైన వారి కుటుంబంలో సభ్యుల సంఖ్య, గతేడాది వారు వాడిన సిలిండర్ల సంఖ్య వంటి వాటిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. కాగా, రాష్ట్రంలో ప్రతినెలా సిలిండర్ రీఫిల్ చేసుకునే వారు 44 శాతం మంది మాత్రమే ఉన్నారు. కొత్తగా రేషన్ కార్డులు పొందే వారికీ ఈ పథకాన్ని వర్తింపచేయాలని, అయితే, కొత్తగా గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న వారిని పరిగణలోకి తీసుకోవద్దని పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.


ఇంటి వద్దే ఈ కేవైసీ


మరోవైపు, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఈ కేవైసీ తప్పక చేయించుకోవాలన్న ప్రచారం జరగడంతో గ్యాస్ ఏజెన్సీలకు వినియోగదారులు పోటెత్తారు. అయితే, ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, ఈ కేవైసీ చేసిన వారికే రూ.500 గ్యాస్ సిలిండర్ అనేది అపోహ మాత్రమేనని ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. కేంద్రం సూచనల మేరకు నవంబర్ నుంచే రాష్ట్రంలో కేవైసీ పరిశీలన జరుగుతోందని స్పష్టం చేసింది. గ్యాస్ సిలిండర్ ఈ కేవైసీకి సంబంధించి ఆఫీసులకు గుంపులుగా వచ్చి ఇబ్బందులు పడొద్దని రాష్ట్ర ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గతంలో ఓ ప్రకటన విడుదల చేశారు. డెలివరీ బాయ్స్ వద్దే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని స్పష్టం చేశారు. గ్యాస్ ఈ కేవైసీకి సంబంధించి కేంద్రం ఎలాంటి తుది గడువు నిర్ణయించలేదని, వీలైనంత త్వరగా వినియోగదారుల ఇంటి వద్దకే వెళ్లి కేవైసీ పూర్తి చేయాలని తమకు ఆదేశాలు అందినట్లు చెప్పారు. డెలివరీ బాయ్స్ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేక యాప్ ద్వారా కేవైసీ ప్రక్రియ పూర్తి చెయ్యొచ్చని స్పష్టం చేశారు. ఒకవేళ బాయ్స్ వద్ద ఎవరిదైనా పూర్తి కాకపోతే, అలాంటి వారు మాత్రమే ఏజెన్సీ ఆఫీసులకు వెళ్లాలని తెలిపారు.


Also Read: Revanth Reddy Good News: ఆటో డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్‌కు సీఎం రేవంత్ శుభవార్త, రూ.5 లక్షల పాలసీ