ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఆదివారం బిగ్‌బాస్‌ హడావుడిలో ఉండగానే ఇద్దరు బిగ్‌బాస్‌లు సమావేశం రాజకీయంగా సంచలనంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండు పార్టీలు పొత్తులో ఉన్నప్పటికీ ఉన్నట్టుండి వీళ్ల సమావేశం అనేక చర్చలకు దారి తీసింది. 


ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ మాదాపూర్‌లోని పవన్ కల్యాణ్ నివాసానికి చంద్రబాబు తొలిసారిగా వెళ్లారు. పవన్ భార్య అనా లెజినోవా స్వాగతం పలికారు. సుమారు మూడు గంటల పాటు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా చాలా రాజకీయ అంశాలు వీళ్లిద్దరి మధ్య చర్చకు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని నిర్ణయించుకున్న టీడీపీ జనసేన  సీట్ల విషయంలో ఓ స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. 
మరో మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీ సీట్ల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేరింది. ఇప్పుడు టీడీపీ, జనసేన కూడా సీట్ల విషయంలో క్లారిటీ ఉండాలని భావిస్తున్నాయి. అందుకే ఈ అంశంపై చంద్రబాబు, పవన్ మాట్లాడుకున్నారని అంటున్నారు. 


చాలా కాలం తర్వాత ఈ మధ్య ప్రెస్‌ మీట్ పెట్టిన చంద్రబాబు ప్రజాభిప్రాయం మేరకే సీట్లు కేటాయిస్తామని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్‌తో చర్చించి ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలో నిర్ణయించుకొని వాటి వరకు అభ్యర్థులను నిలబెడతామని అన్నారు. ఎవరికి ప్రజాదరణ ఉంటుందో వాళ్లకే అవకాశం ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. 


అందులో భాగంగానే పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు ఆదివారం సమావేశమయ్యారు. సీట్ల సర్దుబాటుపై సుమారు 3 గంటల పాటు చర్చించారు. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. మరో రెండుసార్లు సమావేశమై సంక్రాంతి నాటికి సీట్ల అంశంలో కొలిక్కి రావాలని భావిస్తున్నారు. 


అదే టైంలో మేనిఫెస్టోపై కూడా పవన్, చంద్రబాబు చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలు ఏంటీ... ఎక్కడ ప్రకటించాలి. ఎప్పుడు ప్రకటించాలి. దీని కోసం బహిరంగ సభ ఎక్కడ పెట్టాలి అనే అంశాలపై సుదరీర్ఘంగా చర్చించారు. సంక్రాంతి తర్వాత వీటన్నింటిపై క్లారిటీ వచ్చిన తర్వాత భారీ బహిరంగ సభలో కీలక ప్రకటన చేయనున్నారు.


సమావేశం అనంతరం మాట్లాడిన నాదెండ్ల మనోహర్‌.... ‘‘ఇరు పార్టీల అధినేతల భేటీ చాలా సంతృప్తికరంగా సాగింది. అనేక అంశాలపై చర్చలు సుహృద్భావంగా జరిగాయి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే ఉమ్మడి ధ్యేయంగా వచ్చే ఎన్నికల్లో సమష్టిగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైనా, ఉమ్మడి మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలోనూ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలి..? దాని కోసం ప్రత్యేక వ్యూహంపైనా ఓ సమష్టి కార్యాచరణ తీసుకున్నాం. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ గురించి, ఎన్నికల యాక్షన్ ప్లాన్ గురించి చర్చించాం. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఇరు పార్టీల అధినేతలు పూర్తి స్థాయిలో చర్చించారు. వైసీపీని దీటుగా ఎదుర్కోవడమే కాకుండా, వైసీపీ విముక్త రాష్ట్రాన్ని సాధించేందుకు అవసరం అయిన అన్ని విషయాల పట్ల పూర్తిస్థాయి చర్చ జరిగింది. అధినేతల మధ్య జరిగిన భేటీలో చర్చకు వచ్చిన ఇతర కీలకమైన అంశాల గురించి తర్వాత ప్రత్యేకంగా మాట్లాడుతాం’’ అన్నారు.