టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీ తొలగింపుపై దాఖలైన రివ్యూ పిటిషన్ పై 2:1 మెజారిటీతో వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు(Supreme Court) అంగీకరించింది. టాటా సన్స్(TATA Sons) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ పదవి నుంచి సైరస్ మిస్త్రీ(Cyrus Mistry) తొలగింపును మార్చి 2021లో సుప్రీం కోర్టు సమర్థించింది. నాలుగు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జరిగిన విచారణకు సుప్రీంకోర్టు అప్పట్లో తెరదించింది. మిస్త్రీని ఛైర్మన్ పదవిలో పునరుద్ధరించిన ఎన్‌సీఎల్‌ఎటీ ఉత్తర్వులను పక్కన పెడుతూ, టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (TSPL)లో యాజమాన్య ప్రయోజనాలను వేరుచేయాలని కోరిన ఎస్‌పీ గ్రూప్‌ వినతిని 3-0 నిర్ణయంతో సుప్రీంకోర్టు అపట్లో కొట్టివేసింది. టీఎస్పీఎల్ లో ఎస్పీ గ్రూప్ 18.37 శాతం వాటాలను కలిగి ఉంది. సైరస్ మిస్త్రీ 2012లో టాటా గ్రూప్ ఎమెరిటస్ ఛైర్మన్ రతన్ టాటా తర్వాత టీఎస్పీఎల్ ఛైర్మన్‌(TSPL Chairman)గా నియమితులయ్యారు. అయితే నాలుగేళ్ల తర్వాత నాటకీయంగా ఆయను పదవి నుంచి తప్పించారు. ఇది దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థలో బోర్డ్‌ రూమ్ యుద్ధానికి దారితీసింది. 






సుప్రీంకోర్టు తీర్పుపై స్పందిస్తూ సైరస్ మిస్త్రీ(Cyrus Mistry) నిరాశ వ్యక్తం చేశారు. అయితే తన మనస్సాక్షి స్పష్టంగా ఉందని తన పదవీకాలంలో నాయకత్వంలో తరాల మార్పుకు సంబంధించి తాను తీసుకున్న నిర్ణయంపై ఎటువంటి సందేహం లేదన్నారు. టాటా సన్స్‌లో మైనారిటీ షేర్‌హోల్డర్‌గా, మా కేసుకు సంబంధించి తీర్పు ఫలితంపై నేను వ్యక్తిగతంగా నిరాశ చెందాను అని మిస్త్రీ ఒక ప్రకటనలో తెలిపారు.


రివ్యూ పిటిషన్ పై ఈసారి ఓపెన్ కోర్టులో విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి. రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం ఫిబ్రవరి 15న దీనిని పరిశీలించింది. "అఫిడవిట్‌ల దాఖలు నుంచి మినహాయింపు కోరే దరఖాస్తులు అనుమతిస్తాం. రివ్యూ పిటిషన్‌లను మౌఖిక విచారణ కోరే దరఖాస్తులు కూడా అనుమతిస్తాం. రివ్యూ పిటిషన్‌లను మార్చి 9, 2022న జాబితా చేయండి" అని ఫిబ్రవరి 15న తన ఆర్డర్‌లో సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ రామసుబ్రమణియన్ తన అభిప్రాయాన్ని చెబుతూ ఇలా అన్నారు. "ఈ ఉత్తర్వుతో ఏకీభవించలేనందుకు నేను చింతిస్తున్నాను. నేను రివ్యూ పిటిషన్లను జాగ్రత్తగా పరిశీలించాను. తీర్పును సమీక్షించడానికి సరైన కారణాలేవీ నాకు కనిపించలేదు. రివ్యూ పిటిషన్‌లు పరిధిలోకి రావు కాబట్టి మౌఖిక విచారణను కోరే దరఖాస్తులు కొట్టివేయాలి"


సైరస్ మిస్త్రీ టాటా సన్స్‌కు ఆరో ఛైర్మన్‌గా పనిచేశారు. అక్టోబర్ 2016లో ఆ పదవి నుంచి ఆయనను తొలగించారు. రతన్ టాటా తర్వాత 2012లో మిస్త్రీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 150 ఏళ్ల చరిత్ర గల టాటా గ్రూప్ లో టాటా కుటుంబం వెలుపలి నుంచి మిస్త్రీ  ఛైర్మన్ అయిన రెండో వ్యక్తి.