Water Crisis in Delhi: ఢిల్లీలో నీటి సంక్షోభంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని మందలించింది. అన్ని చోట్లా ట్యాంకర్ మాఫియా కొనసాగుతోందని, ఆ ముఠాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండి పడింది. ప్రభుత్వం పట్టించుకోకపోతే పోలీసులే రంగంలోకి దిగుతారని తేల్చి చెప్పింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ పీవీ వరలేతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అవన్నీ బీజేపీ ట్యాంకర్‌లు అంటూ ఆప్ ఆరోపిస్తోంది. అయితే..హిమాచల్ ప్రదేశ్ నుంచి ఢిల్లీకి నీళ్లు వస్తున్నాయని, వాటిని ఏం చేస్తున్నారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
"ఢిల్లీలో వాటర్ ట్యాంకర్ మాఫియాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు..? ఒకవేళ ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోలేకపోతే పోలీసులను రంగంలోకి దింపుతాం. కోర్టు సాక్షిగా తప్పుడు స్టేట్‌మెంట్‌లు ఎందుకు ఇస్తున్నారు? హిమాచల్ ప్రదేశ్ నుంచి ఢిల్లీకి నీళ్లు వస్తున్నాయి. వాటిని ఏం చేస్తున్నారు? వాటర్ ట్యాంకర్ మాఫియా దండుకుంటోంది"
- సుప్రీంకోర్టు
ఢిల్లీ నీటి సంక్షోభంపై మీడియాలో వచ్చిన కథనాలనూ ప్రస్తావించింది సుప్రీంకోర్టు. నీళ్ల కోసం ప్రజలు ఎంతగా అల్లాడిపోతున్నారో న్యూస్ ఛానల్స్‌లో చూస్తున్నామని, నీటి వృథాని అడ్డుకోవడంలో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించింది. హరియాణా ప్రభుత్వం తమకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ విచారణలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే నీటిని విడుదల చేసినట్టు వివరణ ఇస్తోందని గుర్తు చేసింది సుప్రీంకోర్టు. అదే నిజమైతే వచ్చిన నీళ్లంతా ఎటు పోతున్నాయని అసహనం వ్యక్తం చేసింది. ట్యాంకర్ మాఫియాలకు మాత్రమే నీళ్లు వస్తున్నాయని మండి పడింది. అటు పైప్‌లైన్స్ మాత్రం పూర్తిగా ఎండిపోతున్నాయని స్పష్టం చేసింది. నీటి వృథాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఓ నివేదిక తయారు చేసి ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Also Read: Mohan Majhi: మాస్ లీడర్, ఫైర్ బ్రాండ్ - ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ ప్రస్థానం ఇదే