Telugu News: దాదాపు పాతికేళ్లుగా ఒడిశా బిజూ జనతా దళ్‌కి (BJD) కంచుకోటగా ఉంది. నవీన్ పట్నాయక్‌ని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసి తొలిసారి ఇక్కడ బీజేపీ పాగా వేసింది. మొట్టమొదటి సారి బీజేపీ నేత ఒడిశాకి సీఎం అవనున్నారు. ఎప్పుడూ లేని స్థాయిలో ఇక్కడ బీజేపీ పుంజుకోవడం ఆ పార్టీని ఆనందంలో ముంచెత్తుతోంది. ఇదే సమయంలో రాష్ట్రంపై పట్టు సాధించాలనీ భావిస్తోంది. అందుకే...ఫైర్ బ్రాండ్‌ లీడర్‌గా పేరు తెచ్చుకున్న మోహన్ చరణ్ మాఝీ (Mohan Charan Majhi) ఆ పదవికి తగిన వ్యక్తి అని హైకమాండ్ భావించింది. అందుకే..ఆయనకే ఆ కుర్చీని కట్టబెట్టింది. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలం పెరగడంలో కీలక పాత్ర పోషించారు మోహన్ చరణ్. కియోంజర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీచర్‌గా ప్రయాణం మొదలు పెట్టిన మోహన్ చరణ్...ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. 


శిశుమందిర్‌ టీచర్‌గా..


రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నడిచే సరస్వతి శిశు మందిర్‌లో (Mohan Charan Majhi Profile) గురువుగా తన కెరీర్‌ని ప్రారంభించారు మోహన్ చరణ్ మాఝీ. ఆ తరవాత రాజకీయాలపై ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చారు. 1997లో సర్పంచ్‌గా రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన క్రమంగా ఎదిగారు. 2019లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష చీఫ్ విప్‌గా ఎన్నికయ్యారు. వివాదాల జోలికి పోని మోహన్ చరణ్‌ అవసరం వస్తే మాత్ర ఫైర్‌ బ్రాండ్‌గా మారిపోయే వారు. పైగా బీజేపీకి అత్యంత విధేయుడు కూడా. RSSతో అనుబంధం ఉండడంతో పాటు ఒడిశాలో బీజేపీ యూనిట్‌ కోసం చాలా శ్రమించారు. పార్టీ ఎన్నికల వ్యూహంలోనూ ఆయనదే కీలక పాత్ర. దాదాపు రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న మోహన్ చరణ్‌ ప్రజలతో ఎలా మమేకం అవ్వాలో బాగా తెలిసిన నేత. ముఖ్యంగా గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆయన ప్రాబల్యం ఎక్కువ. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడం వల్ల అప్పటి వరకూ ఉన్న ప్రభుత్వ లోటుపాట్లు అర్థం చేసుకోగలిగారు. ఇక్కడ బీజేపీ ఎలాంటి విధానాలు అమలు చేయాలో కూడా సలహాలిచ్చారు.  


అసెంబ్లీ నుంచి సస్పెండ్..


2023లో మోహన్ చరణ్ మాఝీ అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. స్పీకర్ పోడియంపై పప్పు ధాన్యాలు విసిరారు. కేవలం స్పీకర్‌కి చూపించేందుకే తీసుకొచ్చామని ఆయన వివరణ ఇచ్చినప్పటికీ సస్పెన్షన్‌కి గురయ్యారు. మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలను ఎత్తి చూపించేందుకు ఇలా నిరసన వ్యక్తం చేశారు మోహన్ చరణ్. ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే ముకేశ్ మహాలింగ్‌ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. రూ.700 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ స్కామ్‌పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగేలా చేశారు. అందుకే బీజేపీ మొదటి నుంచి ఆయనకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. ఈ సారి ఎన్నికల ఫలితాలు పార్టీకి అనుకూలంగా రావడంలోనూ మోహన్ చరణ్‌ పాత్ర ఉందని గుర్తించిన బీజేపీ హైకమాండ్ ఆయనకు సీఎం పదవిని రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చింది. 


Also Read: J&K Gunfire: జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట, కాల్పుల్లో ఓ జవాను మృతి - ఆరుగురికి తీవ్ర గాయాలు