Amitabh Bachchan about Kalki 2898 AD Trailer: ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే పలుమార్లు పోస్ట్‌పోన్ అయ్యింది. దీంతో అసలు ఈ సినిమా ఎలా ఉంటుందో, దీని కథ ఏంటో అని ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా కోసం వెయిట్ చేయడం కరెక్టే అంటూ ప్రభాస్ ఫ్యాన్స్.. దీనిని షేర్ చేయడం మొదలుపెట్టింది. ఇక బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఈ మూవీలో ఒక కీలక పాత్రలో కనిపించనుండగా.. ట్రైలర్‌పై తన అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాను..


‘కల్కి 2898 AD’ నుంచి అమితాబ్ బచ్చన్ ఫస్ట్ లుక్ విడుదలయినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఈ క్యారెక్టర్ గురించి చర్చలు మొదలయ్యాయి. ఇందులో ఆయన లుక్ చాలా డిఫరెంట్‌గా ఉందంటూ మాట్లాడుకున్నారు. తర్వాత ఈ క్యారెక్టర్ గురించి ఒక గ్లింప్స్ విడుదల చేసిన తర్వాత అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ‘కల్కి 2898 AD’లో అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామగా కనిపించనున్నారని అర్థమయ్యింది. ట్రైలర్ విడుదలయిన తర్వాత తన బ్లాగ్‌లో దీని గురించి ఒక ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నారు బిగ్ బి. ‘‘నా ఫోన్‌ను ఫిక్స్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. ముందు సెట్ చేసిన సెట్టింగ్ మారిపోవడంతో అన్ని విధాలుగా హెల్ప్ తీసుకోవడానికి ప్రయత్నించాను. చాలా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాను’’ అని చెప్పుకొచ్చారు అమితాబ్. అసలు ఆయన ఫోన్‌కు ఏమైందనేది తర్వాత బయటపెట్టారు.


అలాంటిది జరగదు..


‘‘ఇంగ్లీష్‌లో టైప్ చేస్తే హిందీ పదం వస్తుందేమో అని ప్రయత్నిస్తున్నాను. కానీ నేను ఇంగ్లీష్‌లో టైప్ చేస్తే హిందీలో కాకుండా దేవనాగరీ భాషలో వస్తుంది. ఎన్నో లింక్స్ ఫాలో అయ్యి, ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత నేను ఇప్పుడు నా ఫోన్‌ను కిటికీలో నుంచి విసిరేసి పగలగొట్టాలనే ఆలోచనలో ఉన్నాను’’ అని తెలిపారు అమితాబ్ బచ్చన్. చివరికి తన కోపాన్ని బయటపెడుతున్నానని, ఫోన్ పగలగొట్టడం లాంటిది జరగదని క్లారిటీ ఇచ్చారు. ‘కల్కి 2898 AD’ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు తెలిపారు బిగ్ బి. తన ఇల్లు గడవడానికి ఇంకొక పని దొరికితే చాలు అనుకుంటున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


దీపికాపై ట్రోల్స్..


‘కల్కి 2898 AD’ ట్రైలర్ విషయానికొస్తే.. ఈ ట్రైలర్ ఎన్నో భాషల్లో విడుదలయ్యింది. ముఖ్యంగా ఇది తెలుగులో తెరకెక్కిన చిత్రం కాబట్టి దీని తెలుగు ట్రైలర్ కోసం అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె లాంటి నటీనటులు సొంతంగా డబ్బింగ్ చెప్పారు. ఒకవైపు ట్రైలర్‌లో అమితాబ్ బచ్చన్ వాయిస్‌లో ఇంటెన్సిటీని ప్రేక్షకులు ప్రశంసిస్తుంటే.. మరోవైపు దీపికా మాట్లాడిన తెలుగును ట్రోల్ చేస్తున్నారు. సినిమాలో తనతో డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో డబ్బింగ్ చెప్పించడమే బెస్ట్ అని అంటున్నారు. భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ తెరకెక్కించిన ‘కల్కి 2898 AD’ మూవీ ఫైనల్‌గా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికోసం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



Also Read: 'కల్కి 2898 AD'లో దుల్కర్‌ సల్మాన్‌ది కామియో కాదా? - డైలామాలో పడేసిన ఆ పోస్ట్..