Terror Attack in Jammu: జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ CRPF జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. అర్ధరాత్రి మొదలైన ఎన్‌కౌంటర్ తెల్లవారుజామున వరకూ కొనసాగింది. దొడ జిల్లాలోనూ ఐదుగురు సైనికులతో పాటు ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఉగ్రవాదుల దాడిలో గాయపడ్డారు. జమ్ములోని Reasi లో ఓ బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనలో 9 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. ఉగ్రవాదుల్ని ఏరేసే ఆపరేషన్ మొదలు పెట్టాయి. దాదాపు రెండు రోజులుగా ఇదే పనిలో నిమగ్నమయ్యాయి. కథువాలోని యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్‌ని జమ్ము జోన్‌కి చెందిన అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆనంద్ జైన్ పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...ఛత్తర్‌గలలోని ఆర్మీ బేస్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అర్ధరాత్రి ఒక్కసారిగా తుపాకుల మోత మోగింది. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లోని బేస్‌లనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. ఇద్దరు ఉగ్రవాదులు తమపై దాడి చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వాళ్లలో ఒకరిని కాల్చి చంపినట్టు తెలిపారు.
మరో టెర్రరిస్ట్ కోసం డ్రోన్ సాయంతో గాలిస్తున్నారు. అయితే...స్థానిక గ్రామంలోని ఇళ్లలోకి వెళ్లి ఉగ్రవాదులు మంచినీళ్లు అడిగారని, ఆ సమయంలో గ్రామస్థులు అలారం మోగించారని వివరించారు పోలీసులు. ఈ అలారం విన్న వెంటనే ఉగ్రవాదులు గ్రామస్థులపై కాల్పులు జరిపి పారిపోయినట్టు తెలిపారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు.
"ఉగ్రవాదుల కాల్పుల్లో చాలా మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. అవేవీ నిజం కాదు. ఒకే ఒక వ్యక్తి గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి వచ్చే ఏ సమాచారాన్నైనా నమ్మొద్దు"
- పోలీసులు
అయితే...పాకిస్థాన్ పేరు నేరుగా ప్రస్తావించకుండానే ఉన్నతాధికారులు ఆ దేశంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లో ప్రశాంతమైన వాతావరణంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని మండి పడుతున్నారు.