Telangana RTC Charges: తెలంగాణలో మరో సారి ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగాయి. హైవేలపై టోల్ చార్జీలు పెంచుతూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో జాతీయ రహదారులపై అన్ని టోల్‌గేట్లలో ఈ రుసుములు స్వల్పంగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ టికెట్‌ చార్జీల్లో టోల్‌ గేట్‌ రుసుములు పెరిగాయి. టోల్‌ ప్లాజాలు ఉన్న మార్గాల్లో ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో రూ.3 చొప్పున చార్జీలు పెరిగాయి. 


పెరిగిన రేట్లు ఇవే
టోల్ గేట్లు ఉన్న రహదారుల్లో ప్రయాణించే ఆర్టీసీ బస్సులు కూడా టోల్‌ రుసుములు చెల్లించాల్సి ఉంది. కేంద్రం నిర్ణయంతో టోల్‌ గేట్‌ చార్జీలు పెరగడంతో ఆర్టీసీ ఆ భారాన్ని ప్రయాణికులపైనే మోపింది. టికెట్‌ చార్జీల్లో కలిసి ఉన్న టోల్‌ రుసుములను రూ.3 చొప్పున పెంచింది. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రూ.10గా ఉన్న టోల్‌రుసుమును రూ.13కు, డీలక్స్, సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో ఉన్న రూ.13ను రూ.16కు, గరుడ ప్లస్‌ బస్సుల్లో రూ.14 నుంచి రూ.17కు, నాన్‌ ఏసీ స్లీపర్, హైబ్రీడ్‌ స్లీపర్‌ బస్సుల్లో రూ.15 నుంచి రూ.18కి, ఏసీ స్లీపర్‌ బస్సుల్లో రూ.20 నుంచి రూ.23కు పెంచారు.


తప్పనిసరి పరిస్థితుల్లో..
పెరిగిన ఛార్జీలు తాజాగా అమల్లోకి వచ్చాయి. ఒక్కో టోల్ గేట్‌కు రూ. 3 పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశ వ్యాప్తంగా టోల్ ఛార్జీలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 30 లక్షల మంది ప్రయాణిస్తున్నారని.. ఇందులో సిటీలో 12 లక్షల మంది, పల్లె వెలుగు బస్సుల్లో 12 లక్షల మంది జర్నీ చేస్తున్నారని తెలిపారు. వీరికి చార్జీల పెంపు భారం వర్తించదని, మిగతా 6 లక్షల మందికి మాత్రమే అదనపు భారం పడనుందని అధికార వర్గాల సమాచారం. చార్జీలు పెంచినప్పటికీ ఆయా టోల్ గేట్ల వద్ద డబ్బులు చెల్లించిన తర్వాత, ఆర్టీసీకి అదనంగా ఆదాయం వస్తుందని తెలుస్తోంది.


ఓన్లీ ఫర్ జెంట్స్
టోల్ చార్జీలు పెరిగిన నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ అధికారులు సైతం బస్సు ఛార్జీలను పెంచి టిమ్ మిషన్లలో ఆయా మార్పులు చేశారు. అయితే, ఛార్జీల పెంపుపై ఆర్టీసీ ఎలాంటి ప్రకటనా ఇవ్వకపోవడం గమనార్హం. ఛార్జీలు పెంపుపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. దీంతో వారిపై ఎలాంటి భారం పడే అవకాశం లేదు. ఇప్పుడు ఎటొచ్చి ఆ భారాన్ని మోయాల్సిందల్లా పురుషులు మాత్రమే.