Best Action Movies On OTT: ‘డెత్ విష్’ (Death Wish).. టైటిల్ చూస్తే ఇదేదో హారర్ మూవీలా ఉంది అని అనిపించినా.. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. థ్రిల్లర్ కథ ఉండాలి దాంతో పాటు యాక్షన్ కూడా కావాలి అనుకునే ప్రేక్షకులు తప్పకుండా ‘డెత్ విష్’ను ట్రై చేయాల్సిందే. అంతే కాకుండా ఈ మూవీలో సరిపడా ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి.


కథ..


‘డెత్ విష్’ కథ విషయానికొస్తే.. చికాగోలో క్రిమినల్స్ ఎక్కువయిపోయారని టీవీలో అనౌన్స్‌మెంట్ వస్తుంటుంది. అదే సమయంలో పాల్ (బ్రూస్ విల్లీస్) డాక్టర్‌గా పనిచేస్తున్న హాస్పిటల్‌కు క్రిమినల్స్ చేతిలో గాయపడిన ఒక పోలీస్‌ను తీసుకొస్తారు. తనకు మంచి డాక్టర్‌గా గుర్తింపు ఉంటుంది. పాల్‌కు భార్య లూసీ (ఎలిసబెత్ షూ), కూతురు జోర్డన్ కెర్సీ (క్యామిలీ మోర్రోన్) ఉంటారు. జోర్డన్‌కు న్యూయార్క్ కాలేజ్‌లో సీట్ రావడంతో ఫ్యామిలీ అంతా పార్టీ చేసుకుందామని ఒక రెస్టారెంట్‌కు వెళ్తారు. అక్కడ వాలెట్ పార్కింగ్ చేసే ఉద్యోగి.. పాల్ కారును పార్క్ చేయడానికి తీసుకొని అడ్రస్‌ను సెల్ ఫోన్‌లో ఫోటో తీసుకుంటాడు. ఈ విషయం పాల్‌కు తెలియదు.


ఒక రోజు పాల్ బర్త్‌డే అని ఫ్యామిలీ అంతా కలిసి పార్టీ చేసుకుందామని అనుకుంటారు. అదే సమయంలో హాస్పిటల్ నుంచి ఫోన్ రావడంతో పాల్ వెళ్లిపోతాడు. లూసీ, జోర్డన్ కలిసి సూపర్ మార్కెట్‌కు వెళ్తారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి తన ఇంట్లోకి దొంగలు పడతారు. లూసీ, జోర్డన్‌పై అటాక్ చేసి ఇంట్లోని వస్తువులు తీసుకొని పారిపోతారు. హాస్పిటల్‌లో డ్యూటీలో ఉన్న పాల్ దగ్గరకు తన భార్య, కూతురు పేషెంట్లుగా వస్తారు. అప్పటికే భార్య చనిపోయి కూతురు కోమాలోకి వెళ్లిపోతుంది. పోలీసులు కేసు ఫైల్ చేస్తారు.


కానీ కేసు కొంచెం కూడా ముందుకు కదలకపోవడంతో పాల్ రోజురోజుకీ డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు. అదే సమయంలో తన హాస్పిటల్‌కు వచ్చిన ఒక క్రిమినల్ పేషెంట్ దగ్గర పాల్‌కు ఒక గన్ దొరుకుతుంది. పాల్‌కు గన్ దొరికిన రోజే తను ఇంటికి వెళ్తుంటే రోడ్డు మీద కొందరు దుండగులు ఒక అమ్మాయిని ఇబ్బందిపెడుతూ కనిపిస్తారు. దీంతో తన దగ్గర ఉన్న గన్‌తో వారిపై అటాక్ చేస్తాడు. రాత్రికి రాత్రే ఆ అటాక్ వీడియో వైరల్ అవుతుంది.


వైరల్ అయిన వీడియోలో పాల్ మొహం కనిపించకపోవడంతో అందరూ తనను ‘హుడీ మ్యాన్’ అని పిలవడం మొదలుపెడతారు. అలాంటి మనుషులు సమాజానికి అవసరమని ప్రశంసించడం మొదలుపెడతారు. అదే సమయంలో వాలెట్ పార్కింగ్‌లో పనిచేసే ఉద్యోగికి యాక్సిడెంట్ అవ్వడంతో పాల్ పనిచేసే హాస్పిటల్‌లోనే తనను అడ్మిట్ చేస్తారు. అదే సమయంలో అతడి చేతికి ఉన్న వాచ్‌ను పాల్ గమనిస్తాడు. అది తన ఇంట్లో దొంగలించిన వాచే అని గుర్తిస్తాడు. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా తన ఫోన్‌ను చెక్ చేస్తాడు. మొదట్లో తన కారు నుంచి అడ్రెస్‌ను ఫోటో తీసుకున్న ఫోటోను పాల్ చూస్తాడు. దీంతో ఇతడి ద్వారానే దొంగలకు సమాచారం వెళ్లిందని తనకు అర్థమవుతుంది. అప్పటినుంచి ఆ దొంగల కోసం వేట మొదలుపెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.



ఏం జరగబోతుంది.?


‘డెత్ విష్’ అనేది పూర్తిగా ఒక యాక్షన్ సినిమానే అయినా ఇందులో సరిపడా సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. అసలు ఆ దొంగలను హీరో ఎలా పట్టుకుంటాడు అనే విషయం సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. ఒక్కొక్కరికి హీరో వెంటాడుతూ ఉన్నప్పుడు తర్వాత సీన్‌లో ఏం జరగబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను చూడాలనుకునేవారు ‘డెత్ విష్’ను అమెజాన్ ప్రైమ్‌లో రెంట్‌కు తీసుకోవచ్చు లేదా నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.


Also Read: ఆ కోరిక తీర్చుకోడానికి మళ్లీ పుట్టే సైకో కిల్లర్ - పిల్లాడి అరాచకాలు చూసి తల్లి షాక్, ఇదో వెరైటీ థ్రిల్లర్ మూవీ