Honour Killing: పరువు హత్యలపై తమిళ నటుడు రంజిత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఆయన డైరెక్ట్ చేసిన సినిమా స్క్రీనింగ్ తరవాత మీడియాతో మాట్లాడిన రంజింత్ పరువు హత్యలు నేరం కాదని తేల్చి చెప్పాడు. వాటిని హత్యలుగా పరిగణించకూడదని అన్నాడు. పరువు హత్యల్ని కూడా తమ పిల్లలపై తల్లిదండ్రులు చూపించే ప్రేమగానే చూడాలని వివాదాస్పద కామెంట్స్ చేశాడు. ఆగస్టు 9 వ తేదీన ఈ వ్యాఖ్యలు చేయగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు రంజిత్‌పై తీవ్రంగా మండి పడుతున్నారు. వేరే కులానికి చెందిన అమ్మాయిని లేదా అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ బాధేంటో తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుందని అన్నాడు నటుడు రంజిత్. (Also Read: Gaza: గాజాలోని ఓ స్కూల్‌పై ఇజ్రాయేల్ సేన దాడి, 100 మంది శరణార్థులు మృతి)
"తమకు ఇష్టం లేకుండా పిల్లలు వేరే కులం వాళ్లను పెళ్లి చేసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు. ఓ బైక్ దొంగతనం జరిగినప్పుడు ఏమైందని ఆరా తీస్తాం కదా. ఇదీ అంతే. తల్లిదండ్రులు పిల్లలే జీవితంగా బతుకుతారు. ఉన్నట్టుండి వాళ్లు కనబడకుండా పోతే వాళ్లకు బాధ అనిపించదా..? ఆ సమయంలో కోపం కూడా వస్తుంది. హత్య చేస్తారు. కానీ దీన్ని మనం హింస అనలేం. అది కూడా ఓ రకమైన ప్రేమే"
- రంజిత్, తమిళ నటుడు
ఇప్పుడే కాదు. గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు రంజిత్. కురచ దుస్తులు వేసుకునే మహిళలు ఎవరి ముందైనా డ్యాన్స్ చేస్తారంటూ నోరు జారాడు. అప్పట్లో ఈ కామెంట్స్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన నటించి, డైరెక్ట్ చేసిన "కావుందంపలయలం" సినిమాలోనూ ఎన్నో వివాదాస్పద అంశాలున్నాయి. మహిళల గురించి చెప్పిన డైలాగ్ ఇప్పటికే కాంట్రవర్సీ అయింది. ఇక నెటిజన్లూ రంజిత్‌ని ఆటాడేసుకుంటున్నారు. "సిక్ మెంటాలిటీ" అంటూ తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. పరువు హత్యల్నీ ప్రేమ అని ఎలా అనుకోమంటారు అని ప్రశ్నిస్తున్నారు. అలాంటి వాళ్లు సమాజానికి ప్రమాదకరమని తేల్చి చెబుతున్నారు నెటిజన్లు. ఇలాంటి వ్యక్తిని జైల్లో పెట్టాలని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పరువు హత్యల్ని జస్టిఫై చేయడమేంటని ఇంకొందరు సూటిగా ప్రశ్నిస్తున్నారు. రంజిత్ అదుపు తప్పి మాట్లాడుతున్నారని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదీ రంజిత్ అసలు క్యారెక్టర్ అని మరి కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ల వల్లే పిల్లలు మన దేశంలో సేఫ్‌గా లేరని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: PM Modi: వయనాడ్‌లోని ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే, సహాయక చర్యలపై ఆరా