Kolkata Doctor Murder: కోల్‌కత్తాలో ట్రైనీ డాక్టర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనమవుతోంది. RG కార్ మెడికల్ కాలేజీలోని సెమినార్ హాల్‌లో ఆమె శవమై కనిపించింది. అర్ధనగ్నంగా ఉన్న ఆ బాడీని చూసి అంతా ఉలిక్కిపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. అంతకు ముందు ఇది హత్య మాత్రమే అని అనుకున్నా..పోస్టు మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెపై అత్యాచారం జరిగినట్టు వెల్లడైంది. ఇప్పటికే ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. జూనియర్ డాక్టర్లు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కొవ్వొత్తులతో ర్యాలీలు చేశారు. రాజకీయంగానూ ఈ ఘటన దుమారం రేపింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయని మమతా సర్కార్‌పై బీజేపీ మండి పడుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి విచారణ చేపడుతున్నారు. అరెస్ట్ అయిన వ్యక్తే ఈ నేరం చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. విచారణలో భాగంగా మరో ఇద్దరు వైద్యులను ప్రశ్నించారు.
అయితే..అటాప్సీ రిపోర్ట్‌లో ఆమెని లైంగికంగా వేధించినట్టు, అత్యాచారం జరిగినట్టు తేలింది. ప్రైవేట్ పార్ట్స్‌లో బ్లీడింగ్ అయినట్టు గుర్తించారు. అంతే కాదు. శరీరంపై పలు చోట్ల గాయాలున్నట్టు ఈ రిపోర్ట్‌లో తేలింది. "ఆమె కళ్లు, నోరు నుంచి విపరీతంగా రక్తస్రావమైంది. ముఖంపైనా గాయాలున్నాయి. ప్రైవేట్ పార్ట్స్‌లోనూ బ్లీడింగ్ జరిగింది. పొట్ట, కాళ్లు, మెడ, కుడి చేతిపైనా గాయాలున్నాయి" అని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. కోల్‌కత్తా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం తెల్లవారుజామున 3-6 గంటల మధ్యలో ఈ ఘటన జరిగింది. మెడకు ఉరి బిగించి హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. అటాప్సీ ఫుల్ రిపోర్ట్ వస్తే తప్ప ఓ అంచనాకు రాలేమని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ ఘటనను విచారించేందుకు సిట్‌ని నియమించారు. తన కూతురుని అత్యాచారం చేసి హత్య చేశారని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాధితురాలి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. కచ్చితంగా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అటు బీజేపీ మాత్రం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని పట్టుబడుతోంది. వెంటనే నిందితులను పట్టుకుని కఠిన శిక్ష విధించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇలాంటి ఘటన జరగడం నిజంగా సిగ్గుచేటు అని మండి పడుతోంది. ఇక ఈ మెడికల్ కాలేజీ విద్యార్థులు హాస్పిటల్ బయట కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. దారుణంగా అత్యాచారం చేసి ఆ తరవాత చంపేశారని విద్యార్థులూ చెబుతున్నారు. సీబీఐ విచారణ జరిపించాలన్న డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. శాంతిభద్రతలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. త్వరలోనే ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Also Read: Viral News: ఘోర ప్రమాదం, గాల్లో అదుపు తప్పి చక్కర్లు కొట్టి కుప్ప కూలిన విమానం - 62 మంది మృతి