Brazil Plane Crash: బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సావో పాలో వద్ద ఓ విమానం అదుపు తప్పి కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 62 మంది ప్రాణాలు కోల్పోయారు. సోషల్ మీడియాలో ఈ ప్రమాద దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. గాల్లో అదుపు తప్పి చక్కర్లు కొట్టిన ఫ్లైట్‌ ఒక్కసారిగా  కూలిపోయింది. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఘటనా స్థలానికి పక్కనే ఇళ్లున్నాయి. వాటి వెనకాల చెట్ల పొదల్లో కూలిపోయింది. విమానంలో ఉన్న వాళ్లలో ఒక్కరు కూడా ప్రాణాలతో లేరని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఓ ఇల్లు ధ్వంసమైనట్టు తెలిపారు. స్థానికులకు ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాకియో లూలా డా సిల్వా ( Luiz Inacio Lula da Silva) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలుపుతూ ఓ నిముషం మౌనం పాటించాలని పిలుపునిచ్చారు. 






Airline Voepass ఈ ఘటనపై స్పందించింది. కాస్కావెల్‌ నుంచి టేకాఫ్ అయిన విమానం..విన్హెడో టౌన్‌లో ప్రమాదానికి గురైనట్టు వెల్లడించింది. అయితే...ఈ ప్రమాదానికి కారణమేంటన్నది మాత్రం ఇంకా తెలియలేదని వివరించింది. విచారణ జరుగుతోందని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. ప్రస్తుతానికి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతోంది. 


ప్రమాదానికి ముందు చేసిన ట్రాకింగ్ ప్రకారం విమానం 4,100 అడుగుల ఎత్తులో ఉంది. సావో పాలోకి వచ్చే సమయంలోనే ఇలా కుప్ప కూలిపోయింది. ప్రత్యక్ష సాక్ష్యులు ఈ ప్రమాదాన్ని తలుచుకుని వణికిపోతున్నారు. కొంచెంలో పెను ప్రమాదం తప్పిందని, లేకపోతే విమానం నేరుగా తమ ఇళ్లపై పడిపోయేదని వివరిస్తున్నారు. ఈ శబ్దం వినగానే ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్టుగా అనిపించిందని అంటున్నారు. ఈ శబ్దం విన్న వెంటనే చాలా మంది బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇళ్ల వెనకాలే పొదల్లో విమానం పడిపోవడాన్ని చూసి షాక్ అయ్యారు. 






"ఈ ప్రమాదం జరిగినప్పుడు నేను ఇంట్లోనే భోజనం చేస్తున్నాను. ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించి ఉలిక్కిపడ్డాను. ఏమైందని బయటకు వచ్చి చూశాను. అప్పటికే విమానం గాల్లో చక్కర్లు కొడుతోంది. కచ్చితంగా ఏదో జరుగుతుందని అనుమానం వచ్చింది. మా ఇంటిపైన పడిపోతుందేమో అని భయపడ్డాము. కానీ సరిగ్గా అది చెట్ల పొదల్లో కుప్ప కూలిపోయింది"


- ప్రత్యక్ష సాక్షి


Also Read: Wayanad News: కేరళలో కొండచరియలు మళ్లీ విరిగిపడతాయా? మరోసారి వరదలకు అవకాశమెంత?