నకిలీ వెబ్‌సైట్స్‌తో వ్యక్తుల డేటాను, కార్డుల సమాచారాన్ని దొంగిలించే నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి స్కామ్‌లు ప్రస్తుతం బాగా ఎక్కువయ్యాయి. అయితే డేటా చోరీకి సాధారణ వెబ్‌సైట్స్, సంస్థలే కాదు సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌ను కూడా వదలడం లేదు. ఈ విషయంపై స్వయంగా సర్వోన్నత న్యాయస్థానమే హెచ్చరించింది. అధికారిక సుప్రీంకోర్టు వెబ్‌సైట్ మాదిరిగా నకిలీ వెబ్‌సైట్ రూపొందించి వ్యక్తుల డేటాను దొంగిలిస్తున్నట్ల తమ దృష్టికి వచ్చిందని సుప్రీంకోర్టు రిజిస్టరీ వెల్లడించింది. సైబర్ ఎటాక్స్ గురించి హెచ్చరిస్తూ రిజిస్టరీ ఆఫ్ సుప్రీంకోర్టు ఓ అడ్వైజరీని జారీ చేసింది.
అధికారిక సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్ మాదిరిగా అదే విధంగా ఉండేలా వేరే యూఆర్‌ఎల్స్ క్రియేట్ చేసి మోసం చేస్తున్నారని అడ్వైజరీలో పేర్కొన్నారు. http://cbins/scigv.com , https://cbins.scigv.com/offence లాంటి ఫేక్ యూఆర్‌ఎల్స్ హోస్ట్ చేసి సైబర్ నేరగాళ్లు డేటా చోరీకి తెగబడుతున్నారని ప్రజలు ఇలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇందులోని రెండో యూఆర్‌ఎల్‌లో అఫెన్స్ ఆఫ్ మనీ లాండరింగ్ అని హెడర్ ఉన్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. దీని ద్వారా వ్యక్తుల పర్సనల్ వివరాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు దొంగిలిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ నకిలీ వెబ్‌సైట్స్‌లో బ్యాంకు పేరు, ఖాతా నంబరు, పాన్ కార్డు నంబరు, ఫోన్ నంబరు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, లాగిన్ పాస్‌వర్డ్, కార్డ్ పాస్‌వర్డ్ ఇలా పలు కాలమ్స్ ఉంటాయని, వాటిలో డీటెయిల్స్ ఎంటర్ చేస్తే వ్యక్తుల సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు తెలుసుకుంటారు.ఈ తరహా యూఆర్‌ఎల్స్‌ను ఓపెన్ చేసి చూసే వినియోగదారులు ఎవరైనా వ్యక్తిగతమైన, గోప్యంగా ఉంచాల్సిన బ్యాంకు సంబంధిత వివరాలు అస్సలు వెబ్‌సైట్స్‌లో ఎంటర్ చేయొద్దని కోర్టు అడ్వైజరీలో సూచించింది.
ఫిషింగ్ అటాక్‌పై సుప్రీంకోర్టు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు తెలియజేసిందని, వారు దర్యాప్తు చేపట్టి నేరస్థులను పట్టుకుంటారని తెలిపింది. www.sci.gov.in ఇది సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్ అని, ప్రజలు యూఆర్‌ఎల్ చెక్‌చేసుకోవాలని అడ్వైజరీ వెల్లడించింది. ఒక వేళ ఎవరైనా సైబర్ ఎటాక్‌కు గురైతే వెంటనే మీ అన్ని ఆన్‌లైన్ ఖాతాల పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని సూచించింది. అలాగే వెంటనే మీ బ్యాంకు, క్రెడిట్ కార్డు కంపెనీలను సంప్రదించి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తపడాలని హెచ్చరించింది.