తొలిసారి సుప్రీం కోర్టు నుంచి ప్రత్యక్ష ప్రసారం జరుగుతోంది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తన చివరి వర్కింగ్ డే సందర్భంగా...ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పార్టీల ఉచిత హామీలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. చరిత్రలోనే తొలిసారి విచారణ ప్రక్రియను లైవ్‌ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఉచిత హామీలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఓ అభిప్రాయానికి రావాలని కేంద్రాన్ని ఆదేశించింది. నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని వెల్లడించింది. 2013 తీర్పుపై సమీక్ష జరపాలని త్రిసభ్య ధర్మాసనానికి సూచించింది. ప్రజల సంక్షేమం కోసం అమలు చేసే పథకాలు..ఉచిత హామీల కిందకు రావన్న రాజకీయ పార్టీల వాదనను త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది. 2013లో ఈ తరహా కేసునీ ఈ సందర్భంగా ప్రస్తావించింది. అప్పట్లో ఎన్నికల సమయంలో టీవీలు, ల్యాప్‌టాప్‌లు ఉచితంగా పంచటం, కేవలం సంక్షేమం కిందకే వస్తుందన్న అంశాన్నీ పునఃపరిశీలించాలని మరో త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. 


ఉచిత హామీల అంశంతో పాటు 2007లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ "విద్వేష పూరిత ప్రసంగం" అంశంపైనా విచారణ జరిపింది. ఈ ప్రసంగం ఆధారంగా ఆయనను విచారించాలన్న పిటిషన్‌ను ఎన్‌వీ రమణ ధర్మాసనం కొట్టి వేసింది. ఈ కేసుని విచారించాల్సిన అవసరం ఏమీ కనబడలేదని వ్యాఖ్యానించింది. జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ రవికుమార్ కూడా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనంలో ఉన్నారు. ఈ కేసు విచారణలో ఎలాంటి జాప్యం జరగలేదని, అవకతవకలూ లేవని 2018లోనే అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఆదిత్యనాథ్ 2007లో ఎంపీగా ఉన్న సమయంలో విద్వేష పూరిత ప్రసంగం చేశారని ఆయనపై గోరఖ్‌పూర్‌ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదైంది. ఆయన ప్రసంగం తరవాతే రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయన్న ఆరోపణలూ వచ్చాయి. 



ఉచిత హామీలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ ఉచిత హామీలపై ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను అడ్డుకోలేం"అని తేల్చి చెప్పింది. డీఎంకే పార్టీ వేసిన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రజాసంక్షేమమేప్రభుత్వాల విధి అని వెల్లడించింది. "ప్రజా ధనాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారన్నదే ముఖ్యమైన విషయం. కానీ ఈ విషయంలో ఓ నిర్ణయానికి రావటం చాలా కష్టం. ఇలాంటి అంశాలను సుప్రీం కోర్టు పరిశీలిస్తుందా అన్న ప్రశ్నించుకోవాల్సి వస్తుంది"  అని చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ వ్యాఖ్యానించారు. ఈ మధ్యే డీఎమ్‌కే పార్టీ ఉచిత హామీలపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను, ఉచిత హామీలుగా పరిగణించటం సరికాదని వాదించింది డీఎమ్‌కే. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం..అలా వ్యాఖ్యానించింది. ఈ ఉచిత హామీల అంశం తేల్చేందుకు ఓ కమిటీ వేయాలనుకుంటున్నట్టు సుప్రీం కోర్టు వెల్లడించింది. "ఉచిత హామీలు మాత్రమే ఎన్నికల్లో విజయాన్ని నిర్ణయిస్తాయని చెప్పటం సరికాదు. కొన్ని పార్టీలు ఎన్నో హామీలు ఇచ్చి కూడా విజయం సాధించలేక పోతున్నాయి. ఉపాధి హామీ లాంటి పథకాలు పౌరులు గౌరవంగా జీవనం సాగించేందుకు ఉపకరిస్తున్నాయి" అని చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ గతంలో అభిప్రాయపడ్డారు.