రేషన్ కార్డుల వివరాలు నమోదు చేయండి: సుప్రీం కోర్టు
దేశం ఇంత అభివృద్ధి చెందుతున్నా, ఇంకా కొంత మంది ఆకలితో మాడిపోతున్నారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. వలస కార్మికులకు రేషన్ అందించే విషయమై విచారణ జరిపిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాల తీరుని ఈ సందర్భంగా ప్రస్తావించింది. వలస కార్మికులకు సరైన విధంగా రేషన్ అందించేందుకు అవసరమైన "మోడల్"ను సిద్ధం చేయాలని ఆదేశించింది. జస్టిస్ ఎమ్ ఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ జరిపింది. ప్రతి రాష్ట్రంలోని ఆహార, పౌర సరఫరాల విభాగాలు ఎంత మందికి రేషన్ కార్డులు ఇస్తున్నామన్న వివరాలు కచ్చితంగా నమోదు చేయాలని స్పష్టం చేసింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఏదో ఓ పద్ధతిని అనుసరించి ఈ ప్రక్రియ చేపట్టాలని తేల్చి చెప్పింది. ఈ మొత్తానికి తప్పనిసరిగా ఓ క్రైటేరియాను ఫాలో అవ్వాలని వ్యాఖ్యానించింది.
ఆకలి చావులు ఉండకూడదు..
"దేశంలో ఏ ఒక్కరు కూడా ఆకలితో ప్రాణాలు కోల్పోకుండా చేయటమే అంతిమ లక్ష్యం. కానీ...దురదృష్టవశాత్తూ భారత్‌లో ఇది జరుగుతోంది. అభివృద్ధి జరుగుతున్నప్పటికీ ఆకలి చావులు ఆగటం లేదు. కొన్ని గ్రామాల్లో ప్రజలు తమ కడుపుని గట్టిగా కట్టేసుకుంటున్నారు. అలా చేస్తే ఆకలి వేయదని చీరతోనే, తాడుతోనే కట్టేసుకుంటారు. నీళ్లు తాగి పడుకుంటారు. ఆహారం వారికి అందుబాటులో ఉండకపోవటం వల్ల ఇలా చేస్తున్నారు" అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. రెండు వారాల్లో హియరింగ్ పూర్తి చేసి ఇందుకు సంబంధించిన అధికారిక ఆదేశాలు జారీ చేస్తామని చెప్పింది. ఓ ముగ్గురు సామాజిక కార్యకర్తలు వేసిన పిటిషన్‌పై ఈ విచారణ జరిపింది సుప్రీం కోర్టు. కొవిడ్ కారణంగా ఆహార భద్రత కోల్పోయిన వారికి అండగా నిలిచేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
చెప్పుల్లేకుండా రోడ్లపై నడిచిన వలస కార్మికులు
కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో వలస కార్మికులు రోడ్లపై చెప్పులు కూడా లేకుండా సొంతూళ్లకు వెళ్లిపోయిన దృశ్యాలు ఎప్పటికీ మరిచి పోలేం. మార్గ మధ్యలో వాళ్ల పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి వాళ్లకు ఆహార పొట్లాలు అందించాయి. కొన్ని చోట్ల కొవిడ్ టెస్ట్‌లు చేశారు. ఇలా నెలల పాటు వీరి పాదయాత్ర కొనసాగింది. ఇప్పటికీ నగరాలకు వచ్చి పని చేసుకోవాలంటే వాళ్లు భయ పడుతున్నారు. ఆ సమయంలో ఓ పూట తిండికి కూడా ఇబ్బందులు పడ్డారు. కేంద్ర ప్రభుత్వం రేషన్ అందించినా ఇది పూర్తి స్థాయిలో అందరికీ చేరువ కాలేదు. ఇప్పటికీ ఎంత మంది వలస కార్మికులు ఉన్నారన్న లెక్క తేల్చటంతోనే కాలం గడిచిపోతోంది.