Electoral Bonds Scheme: ఎలక్టోరల్ బాండ్స్ విక్రయాలపై ప్రత్యేకంగా సిట్ వేసి విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎవరికి ఎంత లబ్ధి చేకూరింది అన్నది తేల్చాలని, అందుకోసం రిటైర్డ్ జస్టిస్‌తో కమిటీ వేసి విచారణ జరిపించాలని పిటిషన్‌లు వేశారు. రాజకీయ పార్టీలకు, కార్పొరేట్ డోనార్స్‌కి మధ్యలో ఎలాంటి లావాదేవీలు జరిగాయో బయటపెట్టాలని అందులో ప్రస్తావించారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో సహా జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ని తిరస్కరించింది. దీనిపై విచారణ జరిపించాలనడం సరి కాదని తేల్చి చెప్పింది. ఇది కచ్చితంగా తొందరపాటు అవుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలకు ఏ మేర విరాళాలు అందాయన్న వివరాలతో పాటు వాటికి సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ వివరాలనూ వెల్లడించాలని పిటిషనర్లు కోరారు. కానీ సుప్రీంకోర్టు ఈ విజ్ఞప్తిని పక్కన పెట్టింది. ఇదంతా ఐటీ డిపార్ట్‌మెంట్‌లోని అధికారులకు సంబంధించిన పనులని, తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పైగా ఈ దశలో ఇందులో జోక్యం చేసుకోవడం తొందరపాటు అవుతుందని వివరించింది. చట్టప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనేది మాత్రం ఆలోచించాలని, ఈ విషయంలో కోర్టు చేసేదేమీ లేదని వెల్లడించింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలక్టోరల్ బాండ్స్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇవి రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. వెంటనే వీటిని రద్దు చేయాలని తేల్చి చెప్పింది. ప్రస్తుత పిటిషన్‌లపై విచారణ జరిగినప్పుడు అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ సిట్‌ని ఏర్పాటు చేయాలని వాదించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటే ప్రత్యేక కమిటీ అవసరమని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయాలని అన్నారు. మరో సీనియర్ అడ్వకేట్ విజయ్ హన్సారియా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఇచ్చిన డబ్బుల్ని విరాళాలుగా భావించలేమని వాదించారు. పార్టీలు బయట పెట్టని ఆస్తులన్నీ ఎలక్టోరల్ బాండ్స్ కిందకే వస్తాయని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం అందుకు అంగీకరించలేదు.
"రాజ్యాంగంలోని 32వ ఆర్టికల్ ప్రకారం ఇందులో జోక్యం చేసుకోవడం సరికాదు. ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్‌లో క్విడ్ ప్రో కో జరిగిందని ఆరోపిస్తూ పిటిషన్‌లు వేశారు. కోర్టు నేతృత్వంలో ప్రత్యేకంగా సిట్ వేసి విచారణ జరిపించాలన్న ఈ పిటిషన్‌లను మేం తిరస్కరిస్తున్నాం. ఈ దశలో కోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోదు. ఇది కచ్చితంగా తొందరపాటు అవుతుంది"
- సుప్రీంకోర్టు
Also Read: Mysterious Deaths: 20 రోజుల్లో 13 మంది చిన్నారులు మృతి, షెల్టర్ హోమ్‌లో అంతు చిక్కని మిస్టరీ