Supreme Court on Smoking: 


ఇలాంటి పిటిషన్లు వేయకండి: సుప్రీం కోర్టు 


ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక కూడా ఇప్పుడు జోక్‌ అయిపోయింది. దీనిపైనా మీమ్స్ వేస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తుంటారు. నిజానికి ఈ రోజుల్లో స్మోకింగ్ చాలా కామన్ అయిపోయింది. 15 ఏళ్లు కుర్రాళ్లు కూడా దమ్ము కొడుతున్నారు. భారత్‌లో స్మోకింగ్ ఏజ్‌ను 18 ఏళ్లుగా నిర్ణయించారు. ఈ వయసు లోపు వాళ్లు స్మోకింగ్ చేస్తే అది చట్ట రీత్యా నేరం. అయితే ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. స్మోకింగ్ ఏజ్‌ను 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచాలని పిటిషన్ వేశారు. అంతే కాదు. లూజ్‌ సిగరెట్ల విక్రయాలనూ నిషేధించాలని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఇద్దరు అడ్వకేట్స్ వేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ సుధాంసు దులియా ధర్మాసనం బుట్టదాఖలు చేసింది. "మీకు ప్రచారం కావాలంటే ఓ మంచి కేసుని వాదించండి. ఇలాంటి పిటిషన్‌లు మాత్రం వేయకండి" అని వారించింది. అడ్వకేట్స్ శుభం ఆవస్తి, రిషి మిశ్రా..తమ పిటిషన్‌లో స్మోకింగ్‌ను నియంత్రించేందుకు కొన్ని మార్గ దర్శకాలు కూడా ఇవ్వాలని కోరారు. వాణిజ్య స్థలాల్లోని స్మోకింగ్ జోన్లను తొలగించటంతో పాటు సిగరెట్ల విడి అమ్మకాలనూ నిషేధించాలని అడిగారు. ముఖ్యంగా విద్యాసంస్థలు, హెల్త్‌ కేర్ ఇన్‌స్టిట్యూషన్స్‌ వద్ద సిగరెట్లు అమ్మకుండా గైడ్‌లైన్స్‌ ఇవ్వాలని కోరారు. కానీ...సుప్రీం కోర్టు పూర్తిగా ఆ పిటిషన్‌నే పక్కన పెట్టింది. 


పాసివ్ స్మోకర్స్‌కు కూడా ప్రమాదమే..


ధూమపానం ఇచ్చే కొద్ది క్షణాల మత్తు కోసం దానికి బానిసలై తమ ఆరోగ్యాన్నే కాదు, పక్క వారి ఆరోగ్యానికి ఎసరు పెడుతున్నారు ఎంతోమంది. ఒకరు ధూమపానం చేస్తుంటే పక్కనే ఉన్నా చాలా మంది ఆ పొగను పీల్చుతుంటారు. ఇలా పీల్చేవారిని పాసివ్ స్మోకర్స్ లేదా సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ అంటారు. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఎంత ప్రమాదమో తెలుసా? ఆ పొగలో 7000 రసాయనాలు ఉంటాయి. అందులో కొన్ని వందల రసాయనాలు చాలా విషపూరితమైనవి. ఓ 70 రసాయనాలు క్యాన్సర్ కు కారణమవుతాయి. సిగరెట్ కాలుతున్నప్పుడు వచ్చే పొగ, సిగరెట్ తాగిన వ్యక్తి వదులుతున్న పొగ, ఈ రెండింటి మిశ్రమ పొగను పాసివ్ స్మోకర్లు పీలుస్తారు. ఇది ఇంకా విషపూరితం. సర్జన్ జనరల్ నివేదిక ప్రకారం 1964 నుంచి ఇప్పటివరకు దాదాపు పాతికలక్షల మంది సెకండ్ హ్యాండ్ స్మోకర్లు మరణించారు. వీరెవ్వరికీ ధూమపానం అలవాటు లేదు. ఈ పొగపీల్చిన వారికి కొరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అలాగే శ్వాసకోశ సమస్యలు, చెవిలో ఇన్ఫె క్షన్లు కూడా వస్తాయి.