Super Star Krishna Death: దిగ్గజ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ కూడా కృష్ట మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఎన్నో ఆవిష్కరణలకు ఆయన నాంది పలికారని కీర్తించారు.
పెను విషాదం
తెలుగు చిత్ర పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తుదిశ్వాస విడిచారు. కృష్ణకు ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. వయసు రీత్యా ప్రతి మనిషి ఆరోగ్యంలో కొన్ని మార్పులు రావడం సహజమే. కృష్ణకూ ఆ విధమైన సమస్యలు కొన్ని ఉన్నాయి. అందువల్ల, అభిమానులు ఆందోళన చెందారు. సోమవారం ఉదయం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఘట్టమనేని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, మధ్యాహ్నానికి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు.
గుండెపోటుతో ఆస్పత్రిలో చేరినప్పటికీ... ఆ తర్వాత మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో కృష్ణ హెల్త్ కండిషన్ క్రిటికల్‌గా మారింది. వెంటిలేటర్ సహాయంతో ఆయనకు చికిత్స అందించారు. కాంటినెంటల్ ఆస్పత్రిలో అంతర్జాతీయ సదుపాయాలతో ఎనిమిది మంది వైద్యులతో కూడిన బృందం నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్స అందించింది. ఆయనను బతికించేందుకు వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ... ప్రయోజనం దక్కలేదు. మంగళవారం తెల్లవారుజామున కృష్ణ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు.